
న్యూస్ డెస్క్: దశాబ్దాల క్రితం తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా హెచ్ఐవీ వ్యాప్తిపై తీవ్ర ఆందోళన ఉండేది. అవగాహన కార్యక్రమాలతో వైరస్ అదుపులోకి వచ్చినా, బిహార్ లోని ఒక జిల్లాలో మాత్రం ఈ సంఖ్య భయపెడుతోంది.
బిహార్ లోని సీతామఢి జిల్లాలో హెచ్ఐవీ తీవ్రత ఉలిక్కిపడేలా ఉంది. ఈ ఒక్క జిల్లాలోనే బాధితుల సంఖ్య దాదాపు 8 వేలకు చేరింది. ఇందులో 18 నుంచి 25 ఏళ్ల లోపు యువతతో పాటు పెద్ద వయసు వారు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు.
ఈ జిల్లాలో కేసులు అదుపులోకి రాకపోవడానికి వలస కూలీలే ప్రధాన కారణమని అధికారులు విశ్లేషిస్తున్నారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు, అసురక్షిత లైంగిక చర్యల కారణంగా వైరస్ ను తిరిగి సొంత రాష్ట్రానికి తీసుకువస్తున్నారు.
సీతామఢిలో నెలకు సగటున 40 నుంచి 60 కొత్త కేసులు నమోదవుతున్నాయి. 2012 నుంచి బిహార్ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో 428 మంది పిల్లలు ఉన్నారంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది.
ప్రభుత్వం పరిస్థితిని అంచనా వేసి, బాధితులకు ఉచితంగా మందులు అందిస్తోంది. జిల్లాలోని ఏఆర్టీ (యాంటీ రిట్రో వైరల్ ట్రీట్ మెంట్) కేంద్రాల ద్వారా నెలకు సుమారు 5 వేల మంది రోగులకు చికిత్స అందుతోంది.
వలస కూలీల కారణంగా ఈ వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో, ఆయా ప్రాంతాల్లో తక్షణమే మరింత విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు.
