
ఆంధ్రప్రదేశ్: రాజధాని అమరావతిలో సరికొత్త అధ్యాయం మొదలైంది. సీఎం చంద్రబాబు నాయుడు ముందుగా ప్రకటించినట్లు ఎన్టీఆర్, మహాత్మా గాంధీ వంటి మహనీయుల విగ్రహాల కంటే ముందే, భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహం అక్కడ కొలువుదీరింది. డిసెంబర్ 25న వాజ్‌పేయి 101వ జయంతిని పురస్కరించుకుని అమరావతిలోని వెంకటపాలెంలో ఈ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు.
సుమారు 3 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీని ఎత్తు 13 అడుగులు కాగా, పీఠంతో కలిపి మొత్తం 17 అడుగుల ఎత్తులో దర్శనమిస్తోంది. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఇతర కూటమి నేతలు పాల్గొని వాజ్‌పేయికి ఘన నివాళులర్పించారు.
నిజానికి రాజధానిలో ముందుగా ఎన్టీఆర్, అంబేద్కర్, గాంధీ విగ్రహాలను ఏర్పాటు చేయాలని బాబు భావించారు. అయితే రాజకీయ సమీకరణాలు, కూటమి బంధం దృష్ట్యా అనూహ్యంగా వాజ్‌పేయి విగ్రహం తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్ విగ్రహ పనులు ఇంకా చర్చల దశలోనే ఉండగా, వాజ్‌పేయి విగ్రహం శరవేగంగా పూర్తి కావడం బీజేపీ-టీడీపీ మధ్య ఉన్న బలమైన మైత్రికి నిదర్శనమని విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతిలో ఆవిష్కరించిన తొలి విగ్రహం వాజ్‌పేయిదే కావడం విశేషం.
