
న్యూస్ డెస్క్: అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం భారీ స్థాయిలో ప్రాజెక్టులు చేపడుతోంది. అత్యాధునిక సౌకర్యాలు, పర్యావరణ హిత నిర్మాణాలతో రాజధాని పనులు వేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా అంతర్జాతీయ స్థాయి సంస్థలు, సాంకేతిక కేంద్రాలు స్థాపన అవుతున్నాయి.
ప్రస్తుతం 33 వేల ఎకరాల్లో నిర్మాణాలు జరుగుతుండగా, అదనంగా మరో 44 వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం, క్రీడా నగరం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్‌కి ఐబీఎం ముందుకు రావడం విశేషం. ఇది అమరావతికి గ్లోబల్ గుర్తింపును తీసుకువస్తుందని అధికారులు చెబుతున్నారు.
సీఆర్డీఏ ఆధ్వర్యంలో గతంలో ప్రతిపాదించిన 70 ప్రాజెక్టులను ఇప్పుడు 110కి విస్తరించారు. ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని నాలుగు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. రవాణా సౌకర్యాల కోసం రోప్‌వే, బుల్లెట్ రైలు ప్రతిపాదనలు కూడా ప్రణాళికల్లో ఉన్నాయి.
మొత్తం రూ.50 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల్లో 90కి టెండర్లు ఆమోదం పొందగా, 78 ప్రాజెక్టులు ఇప్పటికే కాంట్రాక్టర్లకు కేటాయించారు. దీనివల్ల అమరావతి రూపురేఖలు వేగంగా మారనున్నాయి.
ప్రస్తుతం ఖర్చు అంచనాలు భారీగా పెరిగి రెండు లక్షల కోట్లకు చేరాయి. ఇందులో కేంద్రం, రాష్ట్రం, అంతర్జాతీయ రుణాలతో నిధులు సమకూర్చుతున్నారు. విరాళాల రూపంలోనూ కొంత సొమ్ము సేకరించబడుతోంది.
మొత్తం మీద అమరావతి కేవలం రాజధాని మాత్రమే కాకుండా, మరో ప్రపంచాన్ని గుర్తు చేసేలా అభివృద్ధి చెందుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది నిజంగా దేశానికి ప్రెస్టీజ్ ప్రాజెక్టుగా నిలవనుంది.