
న్యూస్ డెస్క్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ముగింపుపై అమెరికా ప్రతిపాదించిన ‘పీస్ ప్లాన్’ చుట్టూ అంతర్జాతీయ రాజకీయాలు వేడెక్కాయి. ఈ ప్రణాళికను అంగీకరించబోమంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీ తాజాగా సంచలన ప్రకటన చేశారు.
మూడేళ్లకు పైగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ 28 సూత్రాల శాంతి ప్రణాళికను ప్రతిపాదించారు. దీనిని కేవలం వారం రోజుల్లో అంగీకరించాలని ఉక్రెయిన్‌ను ఆయన డిమాండ్ చేశారు. ఈ కఠిన అల్టిమేటం ఉక్రెయిన్‌ను ఇరకాటంలో పడేసింది.
దీనిపై స్పందించిన జెలెన్‌స్కీ.. “ఉక్రెయిన్ చరిత్రలో అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాం. ఆత్మగౌరవాన్ని కోల్పోవాలా? లేక మిత్రుడిని (అమెరికా) కోల్పోవాలా?” అని ప్రశ్నించారు. అయినప్పటికీ, వెనుకడుగు వేయబోమనే గట్టి సంకేతమిచ్చారు.
ట్రంప్ ప్రణాళికలో దొనెట్స్క్‌తో సహా పలు కీలక ప్రాంతాలను రష్యాకు అప్పగించడం, ఉక్రెయిన్ సైనిక బలాన్ని తగ్గించడం వంటి అంశాలు ఉన్నాయి. ఇవన్నీ రష్యాకు అనుకూలంగా ఉండటంతో, జెలెన్‌స్కీ వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
మిత్రదేశం మద్దతు కోల్పోయే ప్రమాదం ఉన్నప్పటికీ, తాము గౌరవాన్ని ఎంచుకుంటున్నామని జెలెన్‌స్కీ దృఢంగా ప్రకటించారు. “2022లో ఉక్రెయిన్‌కు ద్రోహం చేయలేదు. ఇప్పుడూ చేయబోను” అంటూ ఆయన తమ నిర్ణయాన్ని తేల్చి చెప్పారు.
ఈ వివాదంపై ట్రంప్‌తో జెలెన్‌స్కీ భేటీ తర్వాతే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే, ఉక్రెయిన్ తన జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీ పడబోదని జెలెన్‌స్కీ ప్రకటన స్పష్టం చేస్తోంది.
