
న్యూస్ డెస్క్: ఏపీలో రాజకీయాలకు కొత్త మలుపు తిప్పేలా వైసీపీ డిజిటల్ బుక్‌ని ప్రారంభించింది. ఇప్పటి వరకు రెడ్ బుక్ పేరుతో జరిగిన చర్చలకు కౌంటర్‌గా ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌ను వైఎస్ జగన్ తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ డిజిటల్ బుక్‌కు “రైజ్ యువర్ ఇష్యూ – రీక్లెయిం యువర్ రైట్” అనే స్లోగన్ ఇచ్చారు. క్యూ ఆర్ కోడ్ ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి, ఓటీపీ ద్వారా లాగిన్ అయి కార్యకర్తలు తమ సమస్యలు లేదా ఫిర్యాదులను నేరుగా నమోదు చేసుకోవచ్చు.
రెడ్ బుక్‌లాగా నాయకత్వం వద్దే కాకుండా, డిజిటల్ బుక్ ప్రతి కార్యకర్త ఫోన్‌లో ఉంటుంది. దీంతో ఎవరు పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా రికార్డులోకి వస్తుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని వైసీపీ హామీ ఇస్తోంది.
జగన్ స్పష్టంగా మాట్లాడుతూ “ఇక మీదట సినిమాయే చూపిస్తాం” అన్నారు. ఎవరైనా అన్యాయం చేసినా, పదవీ విరమణ చేసినా కూడా వారిని చట్టపరంగా తీసుకురావడమే లక్ష్యమని పేర్కొన్నారు.
రెడ్ బుక్ బాధితులందరికీ ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా న్యాయం చేయాలని వైసీపీ ఆలోచిస్తోంది. అన్యాయం ఎదురైనా నిర్భయంగా నమోదు చేసుకోవచ్చని పార్టీ స్పష్టం చేసింది.
మొత్తానికి, రెడ్ బుక్‌పై కౌంటర్‌గా వచ్చిన డిజిటల్ బుక్ ఏ మేర ఫలితాలు ఇస్తుందో చూడాలి. కానీ ప్రస్తుతం ఇది రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
