న్యూస్ డెస్క్: నందిగామ గాంధీ సెంటర్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తొలగించిన ఘటనపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వైసీపీపై ఉన్న కోపాన్ని ప్రజానాయకుడు వైఎస్ఆర్ విగ్రహాల మీద చూపించడం దారుణమని ఆమె అన్నారు.
షర్మిల మాట్లాడుతూ, “వైఎస్‌ఆర్ దేశాన్ని దారిచూపిన నేత. ఆయన పేరు పెట్టుకున్నంత మాత్రాన అది వైసీపీ సొంతం కాదు. తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానేత విగ్రహాన్ని తొలగించడం దిక్కుమాలిన చర్య,” అని పేర్కొన్నారు.
వైసీపీ ఏర్పాటుచేసిన అక్రమ నిర్మాణాల తొలగింపుపై అభ్యంతరం లేదని, కానీ అదే సాకుతో విగ్రహాన్ని తీసేయడం తగదని షర్మిల విమర్శించారు. ప్రభుత్వం దిగజారుడుతనాన్ని ఇది స్పష్టంగా చూపిస్తోందని ఆరోపించారు.
వైఎస్ఆర్ విగ్రహాలను తొలగించడం ద్వారా ప్రజాభిమానాన్ని దెబ్బతీయాలన్న ఉద్దేశమే కనిపిస్తోందన్నారు. దీనిపై తాము కఠినంగా స్పందిస్తామని తెలిపారు.
తక్షణమే రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించకుంటే, ఉద్యమానికి సిద్ధమవుతామని షర్మిల హెచ్చరించారు.
