Saturday, October 10, 2026
HomeBig Storyయూసుఫ్‌గూడ బస్తీ కుర్రాడు.. ఎమ్మెల్యేగా ఘన విజయం

యూసుఫ్‌గూడ బస్తీ కుర్రాడు.. ఎమ్మెల్యేగా ఘన విజయం

yousufguda-basti-boy-naveen-yadav-wins-jubilee-hills

జూబ్లీహిల్స్: ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాలకు ఓ కొత్త యువ నాయకుడిని పరిచయం చేసింది. 11 ఏళ్ల రాజకీయ పోరాటానికి, పట్టుదలకు ఫలితం దక్కింది. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, 41 ఏళ్ల నవీన్ యాదవ్, సుమారు 25 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి, తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. ఇది కేవలం కాంగ్రెస్ విజయం కాదు, ఒక “బస్తీ పిల్లవాడు” ఎమ్మెల్యే అయిన సందర్భం.

నవీన్ యాదవ్ గెలుపు వెనుక ఉన్న అసలైన బలం ఆయన ‘స్థానికత’. ఆయన యూసుఫ్‌గూడలోనే పుట్టి పెరిగారు. “మా కళ్ల ముందు పెరిగాడు, చురుకైనవాడు, ఇప్పటికీ అదే గౌరవం ఇస్తాడు” అని ఆయన చదివిన ఎంజీఎం స్కూల్ ప్రిన్సిపల్ ఎంఎం నాయుడు గర్వంగా చెబుతున్నారు. “చిన్నప్పటి నుంచి ఆడిస్తున్నా, పిల్లాడు ఎమ్మెల్యే అయ్యాడు” అని స్థానిక పంక్చర్ షాప్ ప్రకాష్ ముదిరాజ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ “మా వాడు” అనే భావనే నవీన్‌ను గెలిపించింది.

ఈ విజయం నవీన్‌కు రాత్రికి రాత్రి రాలేదు. ఇది ఆయనకు ముచ్చటగా మూడో ప్రయత్నం. 2014లో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి, 41 వేలకు పైగా ఓట్లు సాధించి రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. 2018లో టికెట్ రాకపోవడంతో స్వతంత్రుడిగా బరిలోకి దిగి 18 వేలకు పైగా ఓట్లు సాధించి తన బలాన్ని నిరూపించుకున్నారు. ఈ రెండు ఓటములు ఆయన్ను ప్రజలకు మరింత దగ్గర చేశాయి.

అంతేకాదు, ఈ గెలుపు వెనుక ఆయన తండ్రి, దివంగత నేత పీజేఆర్ అనుచరుడు అయిన చిన శ్రీశైలం యాదవ్ కల ఉంది. తండ్రి రాజకీయాల్లో రాణించాలనుకున్నా, కేసుల కారణంగా అది సాధ్యపడలేదు. ఇప్పుడు తండ్రి ఆశయాన్ని నవీన్ నెరవేర్చారు.

గతంలో రెండుసార్లు ఓడినా, కాంగ్రెస్‌లో చేరి ఓపికగా పనిచేయడం, 2023 ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి అజారుద్దీన్‌కు మద్దతుగా ప్రచారం చేయడం ఆయనకు మైలేజీ ఇచ్చాయి. బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల కంటే “స్థానికుడు” అనే అంశం బలంగా పనిచేయడంతో, జూబ్లీహిల్స్ ప్రజలు తమ ఇంటి బిడ్డకు పట్టం కట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular