
న్యూస్ డెస్క్: Women’s Cricket World Cup: భారత మహిళల క్రికెట్ ప్రపంచకప్ విజయంలో ఓ తెలుగమ్మాయి కీలక పాత్ర పోషించింది. కడపకు చెందిన నల్లపురెడ్డి శ్రీచరణి (21), తన అరంగేట్రం చేసిన కొద్ది నెలల్లోనే ఈ మెగా టోర్నీలో స్థానం దక్కించుకుని, తన స్పిన్ మాయాజాలంతో జట్టు విజయాల్లో పాలుపంచుకుంది.
నిజానికి శ్రీచరణి ప్రయాణం భిన్నంగా సాగింది. మొదట బ్యాడ్మింటన్, కబడ్డీ ఆడిన ఆమె, ఆ తర్వాత క్రికెట్‌పై ఆసక్తితో ఫాస్ట్ బౌలర్‌గా కెరీర్ ప్రారంభించింది. అక్కడ విజయం దక్కకపోవడంతో, స్పిన్నర్‌గా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణించడంతో శ్రీచరణిపై సెలక్టర్ల దృష్టి పడింది. డబ్ల్యూపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆమెను రూ. 55 లక్షలకు దక్కించుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే జాతీయ జట్టులోకి అడుగుపెట్టి, శ్రీలంకపై అరంగేట్రం చేసింది.
అనుభవం లేకపోయినా, ఆమె నైపుణ్యానికి (లెఫ్ట్ ఆర్మ్ స్పిన్) విలువిచ్చిన సెలక్టర్లు ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేశారు. ఈ నమ్మకాన్ని చరణి వమ్ము చేయలేదు. ముఖ్యంగా, ఆస్ట్రేలియాతో జరిగిన హై-స్కోరింగ్ సెమీఫైనల్‌లో డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఆసీస్ స్కోరును కట్టడి చేసింది.
బ్యాటర్ల కదలికలను బట్టి బంతి వేగాన్ని మార్చడం, వైవిధ్యమైన బంతులతో తికమక పెట్టడం చరణి బలం. ఈ ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌లు ఆడి 14 వికెట్లు పడగొట్టింది. టోర్నీలో దీప్తి శర్మ తర్వాత, భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఈమెనే కావడం విశేషం.
ఇప్పటివరకు 17 వన్డేల్లో 22 వికెట్లు తీసిన శ్రీచరణి, భారత జట్టుకు దొరికిన ఓ ఆణిముత్యం అని నిరూపించుకుంది. ఇదే జోరు కొనసాగిస్తే, భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందించడం ఖాయం.
