
వక్ఫ్ చట్టం, 1995లోని కొన్ని నిబంధనల రాజ్యాంగబద్ధతపై దాఖలైన పలు పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, విచారణను మూడు కీలక అంశాలకు మాత్రమే పరిమితం చేయాలని ధర్మాసనాన్ని కోరారు.
ఈ మూడు అంశాలలో మొదటిది– వక్ఫ్ బై యూజర్ లేదా డీడ్ కింద వక్ఫ్‌గా గుర్తించిన ఆస్తులను తొలగించే అధికారం. రెండోది– వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరుల నియామకానికి ముస్లింల అభ్యంతరం. మూడో అంశం– వక్ఫ్ ఆస్తుల సర్వే బాధ్యతను కలెక్టర్‌కు బదిలీ చేయడంపై అభ్యంతరాలు.
అయితే పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ స్పందిస్తూ, కేంద్రం ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. కొత్తగా లేవనెత్తిన అంశాలు విచారణలో భాగమే కావాలని వాదించారు.
గతంలో ఏప్రిల్ 17న, వక్ఫ్ ఆస్తులను డీ-నోటిఫై చేయబోమని, కొత్త నియామకాలు చేపట్టబోమని కేంద్రం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయగా, తదుపరి విచారణ తేదీలో తీర్పు ఎలా వస్తుందనేది ఆసక్తికరం.
