
వక్ఫ్ ఆస్తుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వక్ఫ్ బోర్డు సభ్యుల నియామకం, ఆస్తుల డీనోటిఫికేషన్ విషయంలో ఎలాంటి మార్పులు చేయబోమని సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. ఈ ప్రకటనకు సంబంధించి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సీజేఐ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనానికి తెలిపారు.
వక్ఫ్ (సవరణ) చట్టం 2025 రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగింది. కేంద్రం గతంలో ఇచ్చిన హామీని మళ్లీ పునరుద్ఘాటించింది. దీంతో ధర్మాసనం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
వక్ఫ్ చట్టం దుర్వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యమని కేంద్రం తెలిపింది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భూములను వక్ఫ్ ఆస్తులుగా గుర్తించడం ప్రశ్నార్హమని అఫిడవిట్‌లో పేర్కొంది. చట్ట సవరణలు పరిపాలనాపరమైనవే తప్ప మత విశ్వాసాలకు సంబంధించవని స్పష్టం చేసింది.
వక్ఫ్ అంటే ముస్లింలు మతపరమైన ప్రయోజనాల కోసం చేసిన విరాళాలు. ఈ విరాళాల నిర్వహణ పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపింది. ఇస్లాం మతాన్ని కించపరిచే ఉద్దేశం లేదని, వినూత్న పరిపాలన పద్ధతులే లక్ష్యమని కేంద్రం స్పష్టం చేసింది.
