
కోలీవుడ్ హీరో విశాల్ నటిస్తున్న ‘మగుదం’ చిత్రం షూటింగ్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. సినిమా సెట్స్‌పై ఉండగానే వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే విశాల్, ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. ఈ సినిమా డైరెక్టర్‌ను తొలగించడంతో వివాదం మొదలైంది.
విశాల్ తన సినిమా ‘మగుదం’ నుంచి దర్శకుడు రవి అరసును అర్ధాంతరంగా తప్పించినట్లు సమాచారం. ఈ నిర్ణయంపై తమిళనాడు డైరెక్టర్స్ అసోసియేషన్, ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (FEFSI) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఈ వివాదంపై ఫెడరేషన్ గట్టిగా స్పందించింది. దర్శకుడు రవి అరసు నుంచి “నో అబ్జెక్షన్ సర్టిఫికెట్” (NOC) తీసుకువచ్చే వరకు ‘మగుదం’ సినిమా షూటింగ్‌లో పాల్గొనవద్దని తమ సభ్యులకు ఆదేశాలు జారీ చేసింది.
విశాల్‌కి ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో దర్శకుడు మిస్కిన్‌తో విభేదాల కారణంగా ‘తుప్పరివాలన్ 2’ (డిటెక్టివ్ 2) సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది, ఆ తర్వాత విశాల్ స్వయంగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.
సినిమా మేకింగ్‌లో విశాల్ ప్రతి విషయంలోనూ అతిగా జోక్యం చేసుకుంటారనే విమర్శ మొదటి నుంచీ ఉంది. అవుట్‌పుట్ విషయంలో ఆయన పట్టుదలగా ఉన్నా, దర్శకులను మధ్యలో తప్పించడం వారి కెరీర్‌ను దెబ్బతీస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
ఇటీవలి కాలంలో విశాల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు రాబట్టడం లేదు. ఆ ఒత్తిడి కూడా ఆయన నిర్ణయాలపై ప్రభావం చూపుతుండవచ్చు. ఏది ఏమైనా, ఫెడరేషన్ తాజా నిర్ణయంతో ‘మగుదం’ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
