
IND vs SA: విరాట్ విశ్వరూపం.. సెంచరీతో దీటైన సమాధానం!
రాంచీ: విమర్శకుల నోళ్లు మూయించాలంటే విరాట్ కోహ్లీ బ్యాట్ మాట్లాడాలి. రాంచీలో సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో కింగ్ కోహ్లీ తన విశ్వరూపం చూపించాడు. తన కెరీర్‌లో 52వ వన్డే సెంచరీ పూర్తి చేసుకుని, “ఆట ఇంకా ముగియలేదు” అనే సందేశాన్ని పంపాడు.
యశస్వి జైస్వాల్ త్వరగా ఔటైనా.. క్రీజులోకి వచ్చిన కోహ్లీ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించాడు. 37 ఏళ్ల వయసులో 2016 నాటి వింటేజ్ ఫామ్‌ను గుర్తు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (57) తో కలిసి 136 పరుగుల బలమైన భాగస్వామ్యం నెలకొల్పి జట్టును పటిష్ఠం చేశాడు.
38వ ఓవర్‌లో ఫోర్ కొట్టి సెంచరీ సాధించాక కోహ్లీ ఉద్వేగంతో సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సమయంలో ఒక వీరాభిమాని మైదానంలోకి దూసుకొచ్చి కోహ్లీ కాళ్లకు నమస్కరించాడు. సెక్యూరిటీ సిబ్బంది అతన్ని బయటకు తీసుకెళ్లడంతో కాసేపు టెన్షన్ నెలకొంది.
కోహ్లీ 120 బంతుల్లో 11 ఫోర్లు 7 సిక్సర్లతో మొత్తం 135 పరుగులు చేశాడు. ధోని సొంతగడ్డ రాంచీలో కోహ్లీకి ఇది మూడో సెంచరీ. టెస్టులు టీ20లకు గుడ్ బై చెప్పిన తర్వాత, అతడి భవిష్యత్తుపై వచ్చిన ఊహాగానాలకు ఈ సెంచరీ ముగింపు పలికింది.
గత నెల ఆస్ట్రేలియా సిరీస్‌లో రెండు డకౌట్ల తర్వాత కోహ్లీ విమర్శల పాలయ్యాడు. ఇప్పుడు సెంచరీతో తన సత్తా ఏంటో మరోసారి స్పష్టంగా నిరూపించాడు.
ఫిట్‌నెస్ ఆటతీరు విషయంలో తనను ఎవరూ ప్రశ్నించలేరని ఈ ఇన్నింగ్స్‌తో కోహ్లీ గట్టి మెసేజ్ ఇచ్చాడు. 2027 వరల్డ్ కప్ రేసులో తాను ముందుంటానని పరోక్షంగా ప్రకటించాడు.
