ఏపీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, పార్టీ అధినేత జగన్ విమర్శలపై ఘాటు సమాధానం ఇచ్చారు. తాను చంద్రబాబు లేదా టీడీపీకి అమ్ముడుపోలేదని స్పష్టం చేస్తూ, తనపై వైఎస్సార్‌సీపీ కోటరీ కావాలనే కుట్ర చేస్తోందని ఆరోపించారు.
“నన్ను రెచ్చగొట్టి జగన్‌కు నష్టం కలిగించాలని చూసే వారే, నా మౌనాన్ని తప్పుగా అభివర్ణిస్తున్నారు,” అని వ్యాఖ్యానించారు.
తనపై నిరాధార ఆరోపణలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం సాగుతోందని అన్నారు. నాలుగేళ్లుగా తనను అవమానించారని, లేని స్కాంలలో తనను బలిపశువుగా చేయాలని ప్రయత్నం చేశారని చెప్పారు. “ఇలా చేయకుంటే చెడ్డవాడిగా ముద్ర వేస్తారా?” అని ప్రశ్నించారు.
ఘట్టమనేని ఆదిశేషగిరిరావును కలవడంపై వివరణ ఇస్తూ, అది వ్యక్తిగత సంబంధమేనని, రాజకీయ చర్చలేమన్నాడు. టీడీపీలో చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. “చేరాలని ఉంటే బహిరంగంగానే కలుస్తా, దాగి ఎందుకు?” అని వ్యాఖ్యానించారు.
లిక్కర్ స్కామ్‌పై స్పందిస్తూ, “జగన్ స్కాం లేదన్నా, ఆ కోటరీ మాత్రం నన్నే అనుమానిస్తోంది,” అన్నారు. విచారణలో తాను ఎవరి పేరూ చెప్పలేదని స్పష్టం చేశారు. పార్టీకి నష్టపెట్టాలనే కుట్రలో తాను భాగం కాదని చెప్పారు.