
న్యూస్ డెస్క్: కరూర్ ఘటనపై దర్యాప్తు ముమ్మరం అవుతున్న తరుణంలో, తమిళనాడు రాజకీయాల్లో ఉద్రిక్తత పెరిగింది. మంత్రి దురైమురుగన్ చేసిన వ్యాఖ్యలు ఈ వ్యవహారానికి మరింత వేడి తెచ్చాయి.
ఆయన మాట్లాడుతూ, “దర్యాప్తు బృందం అవసరమని భావిస్తే నటుడు విజయ్‌ను అరెస్టు చేయడంలో ఎలాంటి వెనుకడుగు ఉండదు. కానీ ప్రభుత్వం కక్ష సాధింపుల మార్గంలో నడవదు,” అని స్పష్టం చేశారు.
సెప్టెంబర్ 27న కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను మద్రాస్ హైకోర్టు తీవ్రంగా పరిగణించి, సిట్ దర్యాప్తు ఆదేశించింది.
ఐజీ అస్త్రా గార్గ్ నేతృత్వంలో ఏర్పడిన సిట్ బృందం ప్రస్తుతం సాక్ష్యాలు సేకరిస్తోంది. కరూర్ పోలీస్ స్టేషన్ నుంచి కేసు రికార్డులు చెన్నైకి తరలించబడ్డాయి.
ఇప్పటికే టీవీకే ప్రధాన కార్యదర్శి ఆనంద్, సంయుక్త ప్రధాన కార్యదర్శి నిర్మల్ కుమార్‌లపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
అయితే, ఈ ఘటనపై విజయ్ వ్యక్తిగత పాత్ర ఉందా లేదా అనే అంశంపై కోర్టు దృష్టి సారించింది. సంఘటన జరిగిన తర్వాత విజయ్ కరూర్ నుంచి వెళ్లిపోయిన విషయంపై కూడా వివాదం రేగింది.
ఇక నమక్కల్ పోలీసులు విజయ్ ప్రచార బస్సును స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. కానీ హైకోర్టు ‘చట్టపరమైన ఆధారాలు ఉన్నప్పుడే చర్యలు తీసుకోవాలి’ అని హెచ్చరించింది. ఈ కేసు ఇప్పుడు కోర్టు పర్యవేక్షణలో కొనసాగుతోంది.
