
విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోతున్న కొత్త సినిమా ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47’ టైటిల్ ఎంతో ఆసక్తిగా ఉంది. ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని టైటిల్ తోనే కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఈ కలయికలో సినిమా వస్తుందంటే, అది ‘మల్లీశ్వరి’కి సీక్వెల్ లా ఉంటుందా అనే చర్చ మొదలైంది.
‘మల్లీశ్వరి’ చిత్రానికి త్రివిక్రమ్ రచయితగా పనిచేశారు. ఆ సినిమాలో వెంకటేష్ బ్యాంకు ఉద్యోగి పాత్ర పోషిస్తారు. రోజు బ్యాంక్ కు వెళ్లే క్రమంలో వెంకీ చేతిలో ఒక నల్లటి బ్యాగ్ కనిపిస్తుంది. ఆ బ్యాగ్ సినిమాలో బాగా హైలైట్ అవుతుంది.
ఇప్పుడు విడుదలైన ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ లుక్ పోస్టర్ లో కూడా వెంకటేష్ చేతిలో అలాంటి నల్లటి బ్యాగే ఉంది. పాత సినిమాలోని బ్యాగ్, తాజా పోస్టర్ లోని బ్యాగ్ సరిపోల్చితే డిజైన్ లో ఎలాంటి తేడా లేకపోవడం అభిమానులను ఆలోచింపజేస్తోంది.
ఈ రెండు బ్యాగులు ఒకేలా ఉండటంతో, మల్లీశ్వరికి ఈ కొత్త కథకు ఏదైనా లింక్ ఉందా అనే సందేహాలు వస్తున్నాయి. అందుకే ఈ కొత్త చిత్రాన్ని ‘మల్లీశ్వరి 2.0’ వెర్షన్ గా చూడొచ్చు అన్న చర్చ సినీ వర్గాల్లో మొదలైంది.
మల్లీశ్వరి విడుదలై రెండు దశాబ్దాలు పూర్తయినా దాని గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు. మల్లీశ్వరి కథాంశం ప్రభావం ‘ఆదర్శ కుటుంబం’పై కొద్దిగా ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. గురూజీ కథలు గత చిత్రాల నుంచి స్ఫూర్తి పొందుతుంటారనే ఆరోపణలు ఎప్పుడూ ఉంటాయి.
