
న్యూస్ డెస్క్: అమెరికాలో ఉన్నత విద్య అనేది లక్షలాది మంది భారతీయ విద్యార్థుల కల. కానీ, ఓ ప్రతిభావంతుడైన ఇంజినీరింగ్ విద్యార్థి కల కల్లలైంది. ఎంతో కష్టపడి అమెరికాలోని టాప్-15 యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ సీటు సాధించినా, యూఎస్ కాన్సులేట్ అతనికి వీసా (F-1) నిరాకరించింది.
మూడు గంటల పాటు క్యూలో నిరీక్షించిన అతనికి ఇంటర్వ్యూలో నిరాశే ఎదురైంది. ఇమ్మిగ్రేషన్ యాక్ట్‌లోని సెక్షన్ 214(b) కింద వీసా తిరస్కరించారు. చదువు పూర్తయ్యాక తిరిగి స్వదేశానికి వస్తాడన్న నమ్మకం వీసా అధికారికి కలగకపోవడమే ఇందుకు కారణం.
ఈ తిరస్కరణపై ఆ విద్యార్థి ‘రెడ్డిట్’ వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు. యూఎస్ వీసా వ్యవస్థ “వ్యక్తిగత అభిప్రాయాలపై, ఏకపక్షంగా” (Subjective and Arbitrary) పనిచేస్తుందని విమర్శించాడు. అద్భుతమైన అకడమిక్ రికార్డు, రెండేళ్ల అనుభవం ఉన్నా.. కొద్ది నిమిషాల ఇంటర్వ్యూలో ఆఫీసర్ ‘ఫీలింగ్’ బాగోలేకపోతే కలలు చెదిరిపోవడమేంటని ప్రశ్నించాడు.
ఈ చేదు అనుభవంతో, అతను అమెరికా వెళ్లాలనే ఆలోచననే విరమించుకున్నాడు. కఠినమైన వీసా నియమాలు, పెరుగుతున్న విద్వేష వాతావరణం, ఉద్యోగాల కొరత చూసి, ఇకపై ప్రయత్నించడం వృధా అని నిర్ణయించుకున్నాడు.
“నా మనశ్శాంతి, గౌరవం ఆ డిగ్రీ కంటే ఎక్కువ. ఇక్కడే (భారత్‌లోనే) ఉండి నా కెరీర్‌ను కొనసాగిస్తాను” అని అతను గట్టిగా నిశ్చయించుకున్నాడు. ఈ ఘటన, టాప్ యూనివర్సిటీ అడ్మిషన్ దొరికినా, వీసా ఇంటర్వ్యూ అనే చివరి అడ్డంకే అసలైనదని నిరూపిస్తోంది.
