
న్యూస్ డెస్క్: “అమెరికన్ల ఉద్యోగాలు భారతీయులు దొబ్బేస్తున్నారు” అంటూ డొనాల్డ్ ట్రంప్ వంటి నేతలు ఎంత గొంతు చించుకుంటున్నా, అమెరికన్ కంపెనీలు మాత్రం భారతీయులకే జై కొడుతున్నాయి. అమెరికాలో ఉపాధి కల్పించకపోయినా, వర్చువల్‌గానైనా సరే తమకు ఇండియన్సే కావాలని అంటున్నాయి. దీనికి కారణం, భారతీయుల మృదుస్వభావం, అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలే.
ప్రస్తుతం ప్రపంచమంతా ‘వర్చువల్’ బాట పట్టింది. బ్యాంకింగ్, షాపింగ్, క్లాసులతో పాటు ఇప్పుడు హోటల్ రిసెప్షన్లు కూడా ఆన్‌లైన్‌లోకి వచ్చేశాయి. అమెరికాలోని మియామిలో ఓ హోటల్, ‘చెక్-ఇన్’ కోసం మనిషికి బదులు ఓ పెద్ద స్క్రీన్‌ను పెట్టింది. ఆ స్క్రీన్‌పై కనిపించే ఉద్యోగి, భారత్‌లో తన ఇంటి వద్ద నుంచే గెస్టులకు స్వాగతం పలుకుతున్నాడు.
ఇదే ‘వర్చువల్ హాస్పిటాలిటీ’. ఇది కేవలం టెక్నాలజీ అద్భుతం కాదు, పక్కా ఆర్థిక వ్యూహం. అమెరికాలో హోటల్ సిబ్బందికి భారీ జీతాలు చెల్లించాలి. ఆ ఖర్చు తగ్గించుకునేందుకు, కంపెనీలు భారత్, ఫిలిప్పీన్స్ వంటి దేశాల నుంచి రిమోట్ సిబ్బందిని నియమించుకుంటున్నాయి.
దీనివల్ల కంపెనీలకు ఖర్చు తగ్గడమే కాకుండా, గెస్టులకు 24 గంటల సపోర్ట్ లభిస్తుంది. ఒకే ఉద్యోగి ఒకేసారి అనేక హోటళ్లను మానిటర్ చేసే వీలుంటుంది.
అయితే, ఈ కొత్త విధానంపై మిశ్రమ స్పందన వస్తోంది. టెక్నాలజీ వల్ల వేగం పెరిగినా, ఆతిథ్య రంగంలో ముఖ్యమైన ‘హ్యూమన్ టచ్’, ఆప్యాయత మిస్ అవుతున్నాయని కొందరు ఆందోళన చెందుతున్నారు. రిసెప్షనిస్ట్ ఇచ్చే చిరునవ్వు, పలకరింపు వీడియో కాల్‌లో దొరకదని వాదిస్తున్నారు.
ఏది ఏమైనా, ఈ ‘వర్చువల్ వర్క్‌ఫోర్స్’ భారత యువతకు కొత్త అంతర్జాతీయ అవకాశాలను సృష్టిస్తోంది. అమెరికా వెళ్లకుండానే, అక్కడి గెస్టులతో పనిచేసే అవకాశం దక్కుతోంది.
