
ఈ దీపావళికి యూఎస్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు వచ్చిన తెలుగు చిత్రాలకు మిశ్రమ స్పందన లభించింది. ‘మిత్రమండలి’, ‘డ్యూడ్’, ‘తెలుసు కదా’, ‘K-ర్యాంప్’ చిత్రాలు ఓవర్సీస్‌లో విడుదలైనప్పటికీ, ఏదీ కూడా పూర్తి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకోలేకపోయింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్లను అందుకోవడం కష్టంగా మారింది.
‘మిత్రమండలి’ చిత్రం తొలిరోజు ప్రీమియర్లతో కలిపి కేవలం 47 వేల డాలర్లు మాత్రమే రాబట్టింది. అయితే, దీని బ్రేక్ ఈవెన్ టార్గెట్ 300,000 డాలర్లుగా ఉంది. ఈ మార్కును అందుకోవడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోంది.
సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ చిత్రం 187,000 డాలర్లతో పర్వాలేదనిపించినా, దాని బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఏకంగా 1.5 మిలియన్ డాలర్లు. ఈ భారీ లక్ష్యాన్ని చేధించాలంటే అద్భుతం జరగాల్సిందే.
ఈ నాలుగు చిత్రాల్లో ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ కాస్త మెరుగ్గా ప్రదర్శన ఇస్తోంది. తొలిరోజు 330,000 డాలర్లు వసూలు చేసినప్పటికీ, 2.3 మిలియన్ డాలర్ల బ్రేక్ ఈవెన్ మార్కును అందుకోవడానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాలి.
ఇక కిరణ్ అబ్బవరం ‘K-ర్యాంప్’ పరిస్థితి కూడా మిశ్రమంగానే ఉంది. దీనికి కూడా యావరేజ్ టాక్ రావడంతో, ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో లేవని తెలుస్తోంది.
మొత్తం మీద, ఈ దీపావళికి యూఎస్ బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమాల సందడి కరువైంది. వీకెండ్ వసూళ్లు పుంజుకుంటే తప్ప, ఈ చిత్రాలు బ్రేక్ ఈవెన్ దాటడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
