
న్యూస్ డెస్క్: భారతదేశ డిజిటల్ చెల్లింపుల రంగంలో యూపీఐ మరో చరిత్ర సృష్టించింది. ఆగస్టు నెలలో తొలిసారిగా 20 బిలియన్ల (2000 కోట్లు) లావాదేవీలు జరిగి రికార్డు సృష్టించిందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ప్రకటించింది.
ఎన్‌పీసీఐ గణాంకాల ప్రకారం, ఆగస్టులో మొత్తం రూ. 24.85 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. జూలైతో పోలిస్తే ఇది 2.8 శాతం వృద్ధి కాగా, వార్షిక ప్రాతిపదికన చూస్తే 34 శాతం పెరిగింది. సగటున రోజుకు 645 మిలియన్ల ట్రాన్సాక్షన్లు నమోదైనట్లు వెల్లడించింది.
గత కొన్ని నెలలుగా యూపీఐ లావాదేవీలు పెరుగుతూ వస్తున్నాయి. జూన్‌లో 18.40 బిలియన్ ట్రాన్సాక్షన్లు కాగా, జూలైలో అది 19.47 బిలియన్లకు పెరిగింది. అదే ఊపులో ఆగస్టు 2న ఒకే రోజు 700 మిలియన్ల లావాదేవీలు జరగడం మరో రికార్డు.
ఇటీవల ఎస్బీఐ రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, డిజిటల్ చెల్లింపుల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. దానికి తరువాత కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయని స్పష్టమైంది.
ప్రత్యేకంగా వినియోగదారుల నుంచి వ్యాపారులకు చేసే (పీ2ఎం) చెల్లింపులు గణనీయంగా పెరిగాయి. 2020లో 39 శాతం మాత్రమే ఉన్న వాటా, ఇప్పుడు 64 శాతానికి చేరిందని నివేదిక తెలిపింది. ఇది భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో సూచిస్తోంది.
