
పహల్గామ్: ఉగ్రదాడి తర్వాత భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమైంది. పాకిస్థాన్ విజ్ఞప్తిపై జరిగిన ఈ రహస్య సమావేశం సుమారు గంటన్నర సాగినా, ఏ నిర్ణయం లేదా ప్రకటన వెలువడకపోవడం గమనార్హం.
పలువురు సభ్య దేశాలు పాక్‌పై తీవ్రంగా ప్రశ్నలు వేసినట్లు సమాచారం. ఈ భేటీలో పహల్గామ్ దాడికి లష్కరే తోయిబా బాధ్యత వహించిందన్న భారత్ ఆరోపణలపై చర్చ జరిగింది.
పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్న దాడిపై పాక్‌కు వివరాలు ఇవ్వాలని సభ్య దేశాలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఇటీవల పాక్ జరిపిన క్షిపణి పరీక్షలపై కూడా ఆందోళన వ్యక్తమైంది.
భద్రతా మండలి ఛాంబర్ కాకుండా, సంప్రదింపుల గదిలో జరిగిన ఈ భేటీ తర్వాత గ్రీస్ రాయబారి “ఈ సమావేశం సహాయకరమైనది” అని పేర్కొన్నారు. రష్యా, ఇతర దేశాలు ఉద్రిక్తతలు తగ్గాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.
ఐతే, ఈ సమావేశం ద్వారా భారత్‌పై ఒత్తిడి తేవాలన్న పాకిస్థాన్ యత్నం మరోసారి విఫలమైందని భారత అధికారులు స్పష్టం చేశారు. పాక్ ప్రయోగం అంతర్జాతీయంగా నిరుత్సాహానికి గురైందని మాజీ రాయబారి అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు.
