
న్యూస్ డెస్క్: యునైటెడ్ కింగ్‌డమ్‌లో వీసా దరఖాస్తుదారులకు ఇకపై ఇంగ్లీష్ భాషా పరీక్ష తప్పనిసరి కానుంది. అంతేకాకుండా, విద్యార్థుల గ్రాడ్యుయేట్ రూట్ వీసా కాలం రెండేళ్ల నుంచి 18 నెలలకు తగ్గించబడింది.
ఈ మార్పుల వల్ల ముఖ్యంగా భారతీయ విద్యార్థులు, నిపుణులకు యూకేలో ఉద్యోగం కోసం గరిష్ఠంగా ఉండే సమయం తగ్గింది. ఈ కొత్త, కఠిన నిబంధనలు 2026 జనవరి 8 నుండి అమలులోకి రానున్నాయి.
కొత్తగా వచ్చే వలసదారులు యూకే సమాజంలో పూర్తిగా కలిసిపోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సెక్యూర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ (SELT) పేరుతో నిర్వహించే ఈ పరీక్షలో అభ్యర్థులు మాట్లాడటం, వినడం, చదవడం, రాయడం అనే నాలుగు నైపుణ్యాలలో B2 స్థాయి పట్టు చూపాలి. భాష నేర్చుకోకుండా ఉండిపోవడం ఆమోదయోగ్యం కాదని హోమ్ సెక్రటరీ షబానా మహ్మూద్ స్పష్టం చేశారు.
విద్యార్థులు చూపించాల్సిన ఆర్థిక అర్హతలు (ఫైనాన్స్ రిక్వైర్‌మెంట్) కూడా పెరిగాయి. లండన్‌లో ఉండే విద్యార్థులు గతంలో £1,483 చెల్లించాల్సి ఉండగా.. ఇప్పుడు £1,529 చెల్లించాలి. విదేశీ నిపుణులను నియమించుకునే యూకే సంస్థలపై విధించే ఇమ్మిగ్రేషన్ స్కిల్స్ చార్జ్ (ISC) ను ఏకంగా 32% పెంచారు. ఈ అదనపు నిధులను బ్రిటిష్ ఉద్యోగుల శిక్షణ కోసం వాడుతారు.
ఉన్నత ప్రతిభావంతులను ఆకర్షించేందుకు కొన్ని ప్రత్యేక వీసా మార్గాలను మాత్రం ప్రభుత్వం సులభతరం చేసింది. హై పొటెన్షియల్ ఇండివిడ్యువల్ (HPI) రూట్‌లో అర్హత ఉన్న అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల సంఖ్యను రెట్టింపు చేయనున్నారు. ఇన్నోవేటర్ ఫౌండర్ రూట్ ద్వారా చదువు పూర్తయ్యాక సొంత వ్యాపారం ప్రారంభించేందుకు సులభంగా వీసా మార్పు చేసుకోవచ్చు.
యూకే ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడే విధంగా మార్పులు చేయాలని ప్రభుత్వం ఆశిస్తోంది. గ్రాడ్యుయేట్ వీసా పొందుతున్న బహుళ విద్యార్థులు గ్రాడ్యుయేట్ స్థాయి ఉద్యోగాల్లోకి మారడం లేదనే డేటా ఆధారంగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలోకి వలసదారుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వలస విధానాన్ని మరింత కట్టుదిట్టం చేసే దిశగా ఈ కీలక మార్పులు చేసింది.
