
అమెరికా: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా టెక్నాలజీ సంస్థలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన ఏఐ సదస్సులో మాట్లాడిన ట్రంప్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు భారతీయులను నియమించుకోవద్దని హెచ్చరించారు. అమెరికన్లకు ప్రాధాన్యం ఇవ్వకుంటే సంస్థలు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
టెక్ కంపెనీల ప్రపంచవాద ధోరణిని ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. అమెరికా స్వేచ్ఛను వాడుకుని ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయని, తమ పాలనలో అది అసాధ్యమని హెచ్చరించారు. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు చైనాలో కంపెనీలు ఏర్పాటు చేసి, భారతీయ ఉద్యోగులను నియమించుకోవడం అభ్యంతరకరమన్నారు.
అమెరికన్ల అవకాశాలను దుర్వినియోగం చేయడం, నిర్లక్ష్యం చేయడాన్ని ట్రంప్ తప్పుబట్టారు. “ఇప్పటి వరకు టెక్ సంస్థలు స్వేచ్ఛను ఆస్వాదించాయి. ఇకపై ఆ రోజులు ట్రంప్ పాలనలో ఉండవు” అని హెచ్చరించారు.
ఎలాంటి సంస్థ అయినా అమెరికా ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. సిలికాన్ వ్యాలీలో దేశభక్తి అవసరమని తెలిపారు.
ఇలాంటి వ్యాఖ్యలతో అమెరికాలోని టెక్ రంగంలో ఉన్న భారతీయుల భవిష్యత్తుపై ప్రశ్నార్థకాన్ని మిగిల్చారు.
