
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాకిస్థాన్ పెద్దలపై మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. గత కొంతకాలంగా ఇస్లామాబాద్‌తో అంటకాగుతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్న ట్రంప్, తాజాగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌లను “గొప్ప వ్యక్తులు” అంటూ ఆకాశానికెత్తేశారు. అంతేకాదు, పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య నెలకొన్న వివాదాన్ని తాను చిటికెలో పరిష్కరిస్తానని కూడా భరోసా ఇచ్చారు.
మలేషియాలో జరిగిన ఆసియాన్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా, థాయిలాండ్-కంబోడియా శాంతి ఒప్పందంపై సంతకం చేసిన అనంతరం ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. తన ఎనిమిది నెలల పాలనలో ఎనిమిది యుద్ధాలను ఆపానని చెప్పుకున్న ట్రంప్, పాక్-ఆఫ్ఘన్ వివాదం తన తొమ్మిదో లక్ష్యమని అన్నారు. “నాకు వారిద్దరూ (షరీఫ్, మునీర్) తెలుసు.. వారు గొప్ప వ్యక్తులు. ఆ సమస్యను త్వరగా పరిష్కరిస్తాననడంలో నాకు ఎలాంటి సందేహం లేదు” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ట్రంప్ తాజా పొగడ్తల వెనుక బలమైన కారణమే ఉంది. ఇటీవల ఈజిప్టులో ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందం కుదరడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించారని భావించిన పాకిస్థాన్, ఆయన్ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది. ఈ సందర్భంగా పాక్ ప్రధాని షరీఫ్, ట్రంప్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. ప్రపంచ శాంతికి ఆయన చేస్తున్న కృషి అసాధారణమని కొనియాడారు. ఇప్పుడు దానికి ప్రతిఫలంగా ట్రంప్ కూడా పాక్ నేతలను పొగుడుతున్నట్లు స్పష్టమవుతోంది.
నిజానికి, ట్రంప్ పాక్ నేతలను పొగడటం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితి సమావేశాల కోసం అమెరికా వచ్చినప్పుడు కూడా షరీఫ్, మునీర్‌లను ఆయన “గొప్ప నాయకులు” అంటూ ప్రశంసించారు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కూడా ఈ ఏడాది రెండుసార్లు వాషింగ్టన్‌ను సందర్శించడం గమనార్హం.
ఒకప్పుడు పాకిస్థాన్‌ను ఉగ్రవాదానికి కేంద్రంగా విమర్శించిన ట్రంప్, ఇప్పుడు అదే దేశ నేతలను ఇలా భుజానికెత్తుకోవడం అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. మారుతున్న ప్రపంచ సమీకరణాల్లో అమెరికా-పాకిస్థాన్ బంధం మళ్లీ బలపడుతోందనడానికి ట్రంప్ వ్యాఖ్యలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.
