
అమెరికా: వైట్ హౌస్ సమీపంలో జరిగిన కాల్పుల ఘటన దేశాన్ని కుదిపేసింది. ఒక ఆఫ్ఘన్ జాతీయుడు ఇద్దరు నేషనల్ గార్డ్స్‌పై కాల్పులు జరపడంతో ట్రంప్ ప్రభుత్వం వెంటనే వలసదారులపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఘటనకు రియాక్షన్‌గా యూఎస్ పౌరసత్వ వలస సేవల సంస్థ (USCIS) సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ భద్రతే ముఖ్యమని చెబుతూ, ‘ఆందోళనకర దేశాల’ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరి గ్రీన్ కార్డును జల్లెడ పట్టాలని నిర్ణయించింది.
అయితే, ఈ క్రాక్‌డౌన్ కేవలం 19 ‘హై రిస్క్’ దేశాలకే పరిమితం. ఇందులో ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, యెమెన్, సుడాన్ వంటి దేశాలు ఉన్నాయి తప్ప, ఇండియా పేరు లేదు. దీంతో అమెరికాలోని భారతీయులు ఊపిరి పీల్చుకున్నారు.
కాల్పులు జరిపిన వ్యక్తి 2021లో బైడెన్ ప్రభుత్వం చేపట్టిన పునరావాస కార్యక్రమంలో భాగంగా అమెరికా వచ్చాడు. ఇలా వచ్చిన వారిలో ఇంకా ఎంతమంది ప్రమాదకరమైన వ్యక్తులు ఉన్నారో అని ట్రంప్ సర్కార్ అనుమానిస్తోంది.
ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులతో పాటు, కొత్తగా వచ్చే వాటికి కూడా ఈ కఠిన నిబంధనలు వర్తిస్తాయి.
ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఇమ్మిగ్రేషన్ రూల్స్ మారుతాయని ఊహించినా, ఈ ఘటనతో అది మరింత వేగవంతమైంది. అమెరికన్ల భద్రత విషయంలో రాజీపడేది లేదని వైట్ హౌస్ గట్టి సంకేతాలు పంపింది.
