
న్యూస్ డెస్క్: తాను ఎన్నో యుద్ధాలను ఆపినా నోబెల్ శాంతి బహుమతి రాకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన అసంతృప్తిని వెళ్లగక్కారు. కోట్లాది మంది ప్రాణాలను కాపాడిన తనకు సరైన గుర్తింపు లభించలేదని వాపోయారు. ఇదే క్రమంలో, పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడం తనకు చాలా సులభమైన పని అని ఆయన వ్యాఖ్యానించారు.
వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్, “నేను ఎనిమిది యుద్ధాలు ఆపాను. ప్రతీసారి ‘ఈ యుద్ధం ఆపితే మీకు నోబెల్ వస్తుంది’ అనేవారు, కానీ రాలేదు. ప్రాణాలు కాపాడటం తప్ప నాకు వేరే విషయాలపై ఆసక్తి లేదు” అని అన్నారు. రువాండా, కాంగో వంటి వివాదాలను పరిష్కరించింది తానేనని ఆయన చెప్పుకొచ్చారు.
భారత్-పాకిస్థాన్ మధ్య శాంతిని నెలకొల్పడంలోనూ తనదే కీలక పాత్ర అని ట్రంప్ పునరుద్ఘాటించారు. అయితే, ఆయన వాదనను భారత ప్రభుత్వం గతంలోనే ఖండించింది. ఇరు దేశాల సైనిక ఉన్నతాధికారుల మధ్య జరిగిన చర్చల ఫలితంగానే కాల్పుల విరమణ సాధ్యమైందని భారత్ స్పష్టం చేసింది.
ఇప్పుడు తన తదుపరి లక్ష్యం పాక్-ఆఫ్ఘన్ వివాదమేనని ట్రంప్ ప్రకటించారు. “ఆ ఘర్షణ గురించి నాకు తెలుసు. నేను తలచుకుంటే ఆ సమస్యను పరిష్కరించడం చాలా తేలిక. ఇది నా తొమ్మిదో లక్ష్యం అవుతుంది. యుద్ధాలను పరిష్కరించడం నాకిష్టం” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తనకంటే ముందున్న ఏ అధ్యక్షుడు ఒక్క యుద్ధాన్ని కూడా ఆపలేదని, తాను మాత్రం కోట్లాది మంది ప్రాణాలను నిలబెట్టానని ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాను నడపాల్సి ఉన్నా, సమయం వచ్చినప్పుడు పాక్-ఆఫ్ఘన్ సమస్యను కూడా పరిష్కరిస్తానని ఆయన వ్యాఖ్యానించారు.
