
అమెరికా: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై తాజాగా వైట్‌హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది. కాళ్ల కింద వాపు రావడంతో వైద్య పరీక్షలు చేయగా, దీర్ఘకాలిక సిరల లోపం అని నిర్ధారణ అయిందని తెలిపారు.
వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ప్రకారం, ట్రంప్‌కు నిర్వహించిన అల్ట్రాసౌండ్ పరీక్షల్లో ఈ సమస్య బయటపడిందని చెప్పారు. ఇది 70 ఏళ్లు పైబడిన వ్యక్తులలో సాధారణంగా కనిపించే అనారోగ్యం.
అదనపు పరీక్షల్లో గుండె, మూత్రపిండాల్లో ఎటువంటి సమస్యలు లేవని నిర్ధారించారట. కానీ ట్రంప్ చేతి వెనుక భాగంలో గాయాలు ఉన్నాయని వెల్లడించారు. తరచూ కరచాలనం చేయడం, ఆస్ప్రిన్ వాడకమే దీనికి కారణమని చెప్పారు.
ఇటీవల ట్రంప్ ఒక ఫుట్‌బాల్ మ్యాచ్‌కు హాజరయ్యిన సమయంలో తీసిన ఫోటో వైరల్ అయింది. అందులో ఆయన చీలమండల చుట్టూ వాపు స్పష్టంగా కనిపించిందని పేర్కొన్నారు.
ఈ ఫోటోతో పాటు, ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై అనేక ఊహాగానాలు ఊపందుకున్నాయి. కానీ అధికారికంగా ఈ సమాచారం రావడంతో స్పష్టత వచ్చింది.
మెడ్లైన్‌ప్లస్ ప్రకారం, కాళ్ళలోని సిరల కవాటాలు బలహీనపడినప్పుడు రక్తం దిగువ భాగాల్లో నిలిచిపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఇది సమయానికి చికిత్స చేస్తే అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.