
కథ: వరుణ్ (సిద్ధు జొన్నలగడ్డ) తల్లిదండ్రులు లేని అనాథ. జీవితంలో బాగా కష్టపడి సెటిలైన తర్వాత, ఒక మంచి కుటుంబం ఏర్పాటు చేసుకోవాలని, పిల్లల్ని కనాలని కోరుకుంటాడు. మొదట ప్రేమించిన రాగ (శ్రీనిధి శెట్టి), కొంత కాలానికి ఇతన్ని అర్థం చేసుకోలేక బ్రేకప్ చెప్పి వెళ్లిపోతుంది. ఈ విరామం తర్వాత వరుణ్, అంజలి (రాశి ఖన్నా)ను మ్యాట్రిమొనీ ద్వారా కలుస్తాడు.
వరుణ్, అంజలి ఇద్దరూ బాగా సింక్ అవ్వడంతో పెళ్లి చేసుకుంటారు. అయితే అంతలోనే వారి జీవితంలో ఒక సమస్య తలెత్తుతుంది. సరిగ్గా ఆ సమయంలోనే, అంజలి ద్వారానే వరుణ్ జీవితంలోకి రాగ మళ్లీ తిరిగొస్తుంది. అసలు ఆ సమస్యేంటి, రాగ పునరాగమనం వరుణ్ కొత్త జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పింది అనేది మిగతా కథ.
విశ్లేషణ: ఒక మంచి సినిమాగా, భిన్నమైన ప్రయత్నంగా ‘తెలుసు కదా’ను చెప్పుకోవచ్చు. ఈ చిత్రం మెచ్యూర్డ్ సంభాషణలు, సంక్లిష్టమైన ఆధునిక రిలేషన్‌షిప్‌ల చుట్టూ తిరుగుతుంది. డైలాగులు చాలా పదునుగా, ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. అయితే, రెండుంబావు గంటల నిడివిలో కేవలం నాలుగు పాత్రలు, వారి సంభాషణల మీదే సినిమా నడవడంతో, రెగ్యులర్ వినోదం ఆశించే ప్రేక్షకులకు ఇది కొంత భారంగా అనిపిస్తుంది.
దర్శకురాలు నీరజ కోన తొలి భాగంలో వర్తమానం, పాత లవ్ స్టోరీని సమాంతరంగా నరేట్ చేస్తూ మంచి స్క్రీన్ ప్లేతో ఆసక్తికరంగా సినిమాను ముందుకు నడిపింది. ముఖ్యంగా బ్రేకప్ అయిన అమ్మాయి తిరిగి హీరో జీవితంలోకి రావడంలో ఉన్న ట్విస్ట్ ఈ సినిమాను యూనిక్‌గా నిలబెడుతుంది. ఇంటర్వెల్ సమయానికి కథ ఆసక్తిగా మారుతుంది.
కానీ ద్వితీయార్థంలో పాత్రల ప్రవర్తన కొంచెం అసహజంగా, ఫోర్స్డ్‌గా అనిపించడంతో ప్రేక్షకులు విసుగు చెందుతారు. కథ ముందుకు కదలక ఇబ్బంది పెడుతుంది. చివరి అరగంటలో చక్కటి డైలాగులు, మంచి ఎమోషన్‌తో మళ్లీ సినిమా పట్టాలెక్కింది. సిద్ధు జొన్నలగడ్డ అద్భుతమైన పెర్ఫామెన్స్ క్లైమాక్స్‌ను నిలబెట్టింది. కమర్షియల్ సక్సెస్ సందేహమే అయినా, కంటెంట్ రిచ్ మూవీగా ఇది ఒక వర్గం ప్రేక్షకులకు నచ్చుతుంది.
ప్లస్ పాయింట్స్:
- సిద్ధు జొన్నలగడ్డ మెచ్యూర్డ్ నటన.
- తమన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం.
- నీరజ కోన రాసిన అద్భుతమైన సంభాషణలు.
మైనస్ పాయింట్స్:
- ద్వితీయార్థంలో కథనం నెమ్మదించడం.
- సంభాషణలు ఎక్కువై రిపీటిటివ్‌గా అనిపించడం.
- సాధారణ కమర్షియల్ వినోదం లోపించడం.
- పరిమిత పాత్రలతో ఎక్కువ నిడివి.
రేటింగ్: 2.5/5
