
న్యూస్ డెస్క్: తెలంగాణలో జరుగుతున్న స్థానిక సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన ఆసక్తికర సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ ఉదంతాలు అందరిని ఆకర్షించేలా చేస్తున్నాయి.
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం గుంలాపూర్ గ్రామ సర్పంచి ఎన్నికల్లో ఒకే తల్లి రక్తం పుంచుకు పుట్టిన అన్నాచెల్లెళ్లు ఎన్నికల బరిలోకి దిగారు. సర్పంచి పదవిని ఎస్సీ జనరల్‌కు కేటాయించారు.
వీరిలో తెడ్డు శివకుమార్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. బీఆర్ఎస్ మద్దతుతో రౌట్ల స్రవంతి పోటీ చేస్తున్నారు. ఇద్దరు అభ్యర్థులు ఉపసంహరించుకోవడంతో ముగ్గురు బరిలో మిగిలారు.
మరోవైపు, ఉన్నత చదువుల్ని అభ్యసించిన వారు ఎన్నికల్లో నిలవడానికి ఆసక్తి చూపడం లేదన్న మాటకు భిన్నంగా వనపర్తి జిల్లాలో ఒక వైద్య విద్యార్థిని బరిలోకి నిలిచింది. పెబ్బేరు మండలంలోని ఏటిగడ్డ శాఖాపూర్ గ్రామపంచాయితీ సర్పంచి స్థానానికి నిఖిత నామినేషన్ దాఖలు చేసింది.
నిఖిత ప్రస్తుతం నాగర్ కర్నూల్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతోంది. ఆమె తండ్రి డిప్యూటీ తహసీల్దారుగా తల్లి స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు. అదనపు కలెక్టర్ బీమ్యానాయక్ ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ స్థానిక ఎన్నికల్లో అన్నాచెల్లెళ్లు పోటీ చేయడం వైద్య విద్యార్థిని బరిలోకి నిలవటం చాలా ఆసక్తికరంగా మారింది.
