
ఏపీ: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాజోలు పర్యటన సందర్భంగా చేసిన సరదా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి. కోనసీమ అందాలను పొగిడే క్రమంలో.. తెలంగాణ నేతలు దిష్టి పెట్టారా అని ఆయన వ్యాఖ్యానించారు.
పవన్ చేసిన ఈ మాటలకు తెలంగాణ నేతలు వంతులవారీగా మండిపడుతున్నారు. బీఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఈ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మలుచుకుని భావోద్వేగాన్ని తట్టిలేపే ప్రయత్నం చేస్తున్నాయి.
తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ వివాదంలోకి దూకారు. పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు భేషరుతగా క్షమాపణ చెప్పాలని ఆయన సూటిగా డిమాండ్ చేశారు.
“మేము తలచుకుంటే పవన్ సినిమాలు తెలంగాణలో ఒకటి రెండు రోజులు కూడా ఆడవు” అంటూ మంత్రి కోమటిరెడ్డి ఘాటు వార్నింగ్ ఇచ్చారు. క్షమాపణ చెబితేనే ఆయన సినిమాల ప్రదర్శనకు అనుమతి ఇస్తామని తేల్చిచెప్పారు.
ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవిపై మంత్రి పొగడ్తలు కురిపించారు. చిరంజీవికి రాజకీయాలు తెలియవని వెనకేసుకువచ్చారు. కానీ పవన్‌కు ఏ మాత్రం రాజకీయాలు తెలియవని కోమటిరెడ్డి దుయ్యబట్టారు.
పవన్ చేసిన వ్యాఖ్యలు స్వల్పమే అయినా, తెలంగాణ నేతలు తమ స్వరం తామే అని నిరూపించుకోవడానికి పోటాపోటీగా విమర్శలు చేస్తున్నారు. ఈ రాజకీయ దుమారం మరికొన్ని రోజులు కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
