
జూబ్లీహిల్స్: ఉప ఎన్నిక విజయంతో ఉత్సాహంగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పుడు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతోంది. సోమవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది (2026) మార్చి 31 లోపు ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని కేబినెట్ తీర్మానించింది.
అయితే, ఈ నిర్ణయం జూబ్లీహిల్స్ గెలుపు చూసి తీసుకున్నది కాదని, దీనికి బలమైన ఆర్థిక కారణం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 15వ ఆర్థిక సంఘం కాలపరిమితి మార్చి 31తో ముగియనుందని, అప్పటిలోపు ఎన్నికలు పూర్తి చేయకపోతే, గ్రామాలకు రావాల్సిన రూ. 3 వేల కోట్ల నిధులు కోల్పోయే ప్రమాదం ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. పార్టీ పరంగా కూడా 42 శాతం సీట్లు బీసీలకే ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ముందుగా గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది.
ఇతర కేబినెట్ నిర్ణయాలు:
- అందెశ్రీకి గౌరవం: ఇటీవల మరణించిన ప్రముఖ కవి అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఆయన పేరు మీద ‘స్మృతివనం’ ఏర్పాటు. తెలంగాణ గీతాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్పు.
- గ్లోబల్ సమ్మిట్: ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయిన సందర్భంగా, డిసెంబర్ 8-9 తేదీల్లో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ నిర్వహణ.
- సౌదీ బాధితులకు సాయం: సౌదీ అరేబియా రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం. వారి అంత్యక్రియల కోసం మంత్రి అజారుద్దీన్ నేతృత్వంలో బృందాన్ని సౌదీకి పంపాలని నిర్ణయం.
- కొత్త పాలసీ: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ఇండస్ట్రియయల్ భూములను ‘మల్టీ యూజ్ జోన్లు’గా మార్చే పాలసీకి ఆమోదం.
