
తెలంగాణ: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన కీలక హామీపై చేతులెత్తేసింది. ‘మహాలక్ష్మి‘ పథకం కింద కొత్తగా పెళ్లయిన మహిళలకు తులం బంగారం ఇస్తామన్న హామీపై వెనక్కి తగ్గింది. దాదాపు రెండేళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వం, ఇప్పుడు ఆ హామీని నెరవేర్చడం అసాధ్యమని తేల్చిచెప్పింది.
ఈ విషయంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టతనిచ్చారు. తాము హామీ ఇచ్చినప్పుడు తులం బంగారం ధర సుమారు రూ. 50 వేలు మాత్రమే ఉందని, కానీ ఇప్పుడు ఆ ధర రూ. 1.5 లక్షలకు చేరిందని ఆయన అన్నారు. ఇంతటి భారీ ఆర్థిక భారాన్ని ప్రభుత్వం భరించలేదని ఆయన తేల్చిచెప్పారు.
మంత్రి ప్రకటనతో తులం బంగారం వస్తుందని ఆశించిన వేలాది మంది మహిళలు తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం ‘కళ్యాణ లక్ష్మి’ పథకం కింద లబ్ధిదారులకు కేవలం రూ. 1 లక్ష చెక్కు మాత్రమే అందుతోంది. తులం బంగారం హామీ మాటలకే పరిమితమైంది.
ప్రభుత్వం మాట మార్చడంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడుతోంది. కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు బంగారం ధరల పేరుతో సాకులు చెబుతూ ప్రజలను మోసం చేస్తోందని విమర్శలు గుప్పిస్తోంది.
ఉచిత బస్సు ప్రయాణం, పెరిగిన పింఛన్లు వంటి పథకాల భారంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పటికే కష్టాల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే బంగారం హామీని రద్దు చేసుకున్నారని, ఈ నిర్ణయం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్‌కు ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
