
న్యూస్ డెస్క్: తమిళనాడులో భారీ ఉద్యోగ కుంభకోణం బయటపడటం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, వాటర్ సప్లై విభాగంలో జరిగిన నియామకాల్లో కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తులో తేలింది. ఒక్కో ఉద్యోగం కోసం రూ. 25 లక్షల నుంచి రూ. 35 లక్షల వరకు లంచాలు చేతులు మారాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
2024లో అసిస్టెంట్ ఇంజినీర్లు, జూనియర్ ఇంజినీర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు వంటి పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ జరిగింది. సుమారు 1.12 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 2,538 మంది ఎంపికయ్యారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వయంగా ఆగస్టులో నియామక పత్రాలు అందించడం గమనార్హం. అయితే, వీరిలో దాదాపు 150 మంది లంచాలు ఇచ్చి అక్రమంగా ఉద్యోగాలు పొందారని ఈడీ గుర్తించింది.
ఈ కుంభకోణం వెనుక రాజకీయ నాయకులు, మధ్యవర్తులు, పరీక్ష నిర్వహించిన సంస్థల మధ్య పెద్ద నెట్‌వర్క్ ఉందని ఈడీ అనుమానిస్తోంది. దీనికి సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, ఆడియో-వీడియో రికార్డులతో కూడిన 232 పేజీల నివేదికను తమిళనాడు పోలీసులకు అందజేసింది. పరీక్ష నిర్వహించిన అన్నా యూనివర్సిటీపై కూడా విచారణ జరపాలని ఈడీ డిమాండ్ చేసింది.
ఈ స్కామ్ తమిళనాడు రాజకీయాల్లో దుమారం రేపింది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. అయితే, ప్రభుత్వం లేదా సీఎం స్టాలిన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాకపోవడం విమర్శలకు తావిస్తోంది.
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ కుంభకోణం డీఎంకే ప్రభుత్వ ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగించే అవకాశం ఉంది. ఈడీ నివేదిక ఆధారంగా తమిళనాడు పోలీసులు విచారణ చేపట్టే అవకాశం ఉంది.
ఈ జాబ్ స్కామ్ నిరుద్యోగుల ఆశలతో ఆడుకోవడమే కాకుండా, ప్రభుత్వ నియామకాల్లో పారదర్శకత, నైతిక విలువలపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది.
