
న్యూస్ డెస్క్: దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న ‘డిజిటల్ అరెస్ట్’ మోసాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సైబర్ నేరాల ద్వారా అమాయక ప్రజల నుంచి ఇప్పటికే రూ. 3,000 కోట్లకు పైగా దోచుకున్నారని అంచనా. ఈ వ్యవహారం దేశ భద్రతకే సవాల్‌గా మారడంతో, సర్వోన్నత న్యాయస్థానం దీనిపై సుమోటోగా (స్వయంగా) విచారణ చేపట్టింది.
జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. “డిజిటల్ అరెస్టుల పేరుతో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ దందా ఆందోళన కలిగిస్తోంది. ఈ సమస్యను ఇక్కడితో వదిలేస్తే భవిష్యత్తులో మరింత తీవ్రమవుతుంది” అని కోర్టు తీవ్రంగా హెచ్చరించింది.
ఈ సంక్లిష్టమైన సైబర్ నేరాల నివారణకు పరిష్కారాలు సూచించేందుకు, సీనియర్ న్యాయవాది ఎన్ఎస్ నప్పినాయ్‌ను కోర్టుకు సహాయకురాలిగా (అమికస్ క్యూరీ) నియమించింది.
కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ, ఈ మోసాల్లో ఎక్కువగా వృద్ధులు, మధ్యతరగతి ప్రజలే బాధితులుగా ఉన్నారని తెలిపారు. సైబర్ మోసాలను అరికట్టేందుకు హోంశాఖలో ప్రత్యేక విభాగం పనిచేస్తోందని, పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని కోరారు.
“మనం తడబడితే ప్రజల విశ్వాసం కోల్పోతాం. కఠినమైన ఆదేశాలు ఇవ్వకపోతే సమస్య పెరిగిపోతుంది” అని జస్టిస్ సూర్యకాంత్ కేంద్రానికి గట్టి సందేశం పంపారు. తదుపరి విచారణను నవంబర్ 10కి వాయిదా వేసిన కోర్టు, ఈ మోసాలను అరికట్టేందుకు కఠిన చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటుకు నాంది పలికింది.
