
న్యూస్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ ప్రయాణికులకు, ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. పల్లె ప్రాంతాలకు వెన్నెముకగా నిలిచే ‘పల్లె వెలుగు’ బస్సులు ఇప్పుడు ‘నాన్‌స్టాప్’ సర్వీసులుగా మారుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
డ్రైవర్లు, కండక్టర్లు నిర్దేశిత స్టాపులలో బస్సులను ఆపకుండా వెళ్తుండటంతో, సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేక సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ సమస్యలన్నింటికీ మూల కారణం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘స్త్రీశక్తి‘ ఉచిత బస్సు ప్రయాణ పథకమేనని స్పష్టమవుతోంది. ఆగస్టు 15న ప్రారంభమైన ఈ పథకానికి మహిళల నుంచి విశేష స్పందన లభించింది. రోజుకు సుమారు 28 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణిస్తుండటంతో బస్సుల్లో రద్దీ అనూహ్యంగా పెరిగిపోయింది.
పెరిగిన రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు, సిబ్బందిని నియమించకపోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. సమయపాలన పాటించడం, ప్రయాణికులను ఎక్కించుకోవడం, దించడం వారికి కత్తి మీద సాములా మారింది. ఈ క్రమంలోనే, సమయాన్ని ఆదా చేసుకునేందుకు కొందరు సిబ్బంది చిన్న చిన్న స్టాపులను వదిలేసి ముందుకు సాగుతున్నారు.
నిజానికి, ఈ పథకాన్ని ప్రభుత్వం ఐదు రకాల బస్సులకే (పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ మొదలైనవి) పరిమితం చేసి, ప్రారంభంలో మంచి ప్రశంసలు అందుకుంది. పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ఈ పథకంపై వ్యతిరేకత కూడా తక్కువగానే వచ్చింది. అయితే, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడటంతో రెండు నెలలకే పరిస్థితి అదుపు తప్పుతోంది.
ఒక మంచి పథకం అమలులో ఎదురయ్యే సవాళ్లను ప్రభుత్వం ముందుగానే అంచనా వేసి, పరిష్కార మార్గాలు కనుగొనడంలో విఫలమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రద్దీ పెరుగుతుందని తెలిసినా, అందుకు తగ్గట్లుగా సర్వీసులను పెంచకపోవడమే ఈ గందరగోళానికి ప్రధాన కారణం.
మహిళలకు వరంలా మారిన ఈ పథకం, ఇతర వర్గాలకు శాపంగా మారకూడదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, అదనపు సర్వీసులను నడపడం ద్వారా సమస్యను పరిష్కరించకపోతే, ‘స్త్రీశక్తి’ పథకం ద్వారా వచ్చిన మంచి పేరు కంటే చెడ్డపేరే ఎక్కువగా మిగిలే ప్రమాదం ఉంది.
