
న్యూస్ డెస్క్: భారత్‌తో అతిపెద్ద వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దేశీయ మార్కెట్లలో ఉత్సాహాన్ని రేకెత్తించాయి. విదేశీ పెట్టుబడుల పెరుగుదలతో శుక్రవారం ట్రేడింగ్ లాభాలతో ప్రారంభమైంది.
ఉదయం 9:15 గంటలకు సెన్సెక్స్ 150 పాయింట్లు పెరిగి 83,906 వద్ద ట్రేడ్ అయ్యింది. నిఫ్టీ 54 పాయింట్లు లాభపడి 25,603 వద్ద కొనసాగింది. ట్రంప్ భారత్‌తో “గొప్ప ఒప్పందం” ఉందని చెప్పడం మార్కెట్ విశ్వాసాన్ని పెంచింది. జూలై 9న విధించాల్సిన టారిఫ్‌ల గడువు పొడిగించబడే అవకాశం ఉండటం కూడా సహకరించింది.
విపణి విశ్లేషకుడు విజయకుమార్ ప్రకారం, ఆటంకాలన్నింటినీ అధిగమించి బుల్ మార్కెట్ కొనసాగుతుందని అన్నారు. నిఫ్టీకి 25,800 వద్ద నిరోధం ఉందని, 25,000 వద్ద మద్దతు ఉందని అక్షయ్ చించాల్కర్ తెలిపారు.
ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్ రంగాల్లో కొనుగోళ్ల మద్దతు కనిపించింది. నిఫ్టీ బ్యాంక్ సూచీ మాత్రం స్వల్ప నష్టాలను నమోదు చేసింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు లాభపడ్డాయి.
ఎఫ్‌ఐఐలు రూ.12,594 కోట్ల ఈక్విటీలను కొనుగోలు చేయగా, డీఐఐలు కొద్దిగా విక్రయించారు. ఎల్ అండ్ టీ, టాటా స్టీల్, ఎస్‌బీఐ లాంటి షేర్లు లాభాల్లో ఉన్నాయి.
ఆసియా మార్కెట్లు ప్రధానంగా నష్టాల్లో ట్రేడవుతున్నప్పటికీ, అమెరికా మార్కెట్లు భారీ లాభాలతో ముగియడం భారత మార్కెట్‌కు బలాన్నిచ్చింది.
