
న్యూస్ డెస్క్: తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ తాజాగా ప్రత్యేక సందేశం పంపించారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆమె ఈ లేఖ ద్వారా పిలుపునిచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌ను ఉద్దేశించి ఆమె ఈ లేఖ రాశారు. రాష్ట్రం అభివృద్ది చెందాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు సోనియాగాంధీ తెలిపారు.
ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8 9వ తేదీల్లో నిర్వహించనున్న ఈ సదస్సులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె కోరారు. దీని ద్వారా రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన కీలక ప్రాజెక్టులు ప్రణాళికల్లో పాలు పంచుకునేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు.
పట్టణ, నగర అభివృద్దితో పాటు, గ్రామీణప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను మెరుగు పరచడమే లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఈ సదస్సు ద్వారా.. రాష్ట్ర ప్రగతి, ప్రజల నైపుణ్యాలు, మానవ వనరుల శక్తి వంటివి ప్రపంచ దేశాలకు తెలుస్తాయని సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు.
ఈ సదస్సుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రధాని మోడీ సోనియాగాంధీ వంటి కీలకనేతలను ఆహ్వానించారు. మోడీ రావడం లేదని, సోనియాగాంధీ కూడా లేఖ రాశారంటే ఆమె వచ్చే అవకాశం తక్కువ అని చెబుతున్నారు.
