
న్యూస్ డెస్క్: భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన పెళ్లి చివరి నిమిషంలో వాయిదా పడింది. సంగీత దర్శకుడు పలాశ్ ముచ్ఛల్‌తో ఆమె వివాహం ఆదివారం జరగాల్సి ఉండగా, వరుసగా ఎదురైన అనూహ్య ఘటనలు ఈ వేడుకను అడ్డుకున్నాయి.
వివాహ వేడుకలు ఉత్సాహంగా సాగుతున్న సమయంలో స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధన్నకు అకస్మాత్తుగా ఛాతి నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. గుండెపోటు లక్షణాలు కనిపించడంతో వైద్యులు చికిత్స ప్రారంభించారు. ఆయనకు ఆంజియోగ్రఫీ చేయనున్నారు.
తండ్రి ఆరోగ్య సమస్యలతో ఆందోళన నెలకొనగా, కొద్ది గంటల్లోనే మరో షాక్ తగిలింది. కాబోయే భర్త పలాశ్ ముచ్ఛల్ కూడా వైరల్ ఫీవర్‌తో పాటు ఎసిడిటీ పెరగడంతో ఆసుపత్రి పాలయ్యారు. చికిత్స అనంతరం ఆయన డిశ్చార్జ్ అయ్యారు.
తండ్రి పరిస్థితి విషమించడంతో వివాహ తంతులను కొనసాగించేందుకు స్మృతి నిరాకరించింది. తండ్రి పూర్తిగా కోలుకునే వరకు పెళ్లిని వాయిదా వేయాలని ఆమె భావోద్వేగంతో నిర్ణయించుకుంది.
ఈ హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలు ఘనంగా జరిగి ఆనందం నిండిన వేళ ఈ అకస్మిక ఘటన అందరికీ షాక్ కలిగించింది. ప్రస్తుతం స్మృతి తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉంది.
వన్డే ప్రపంచకప్ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించిన ఈ జంట, ఇప్పుడు తండ్రి ఆరోగ్యం మెరుగుపడే వరకు వేచి చూడాల్సి వస్తోంది. అభిమానులు వీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
