
కల్ట్ క్లాసిక్ ‘శివ‘ 36 ఏళ్ల తర్వాత 4K ఫార్మాట్‌లో రీ-రిలీజ్‌కు సిద్ధమైంది. అడ్వాన్స్ బుకింగ్స్‌తో రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమాకు, నాటి తరం అభిమానులతో పాటు ఈ తరం యువత కూడా బ్రహ్మరథం పడుతోంది. ఈ నేపథ్యంలో, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నాగార్జున ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
అసలు ‘శివ’ కథకు బీజం పడింది బ్రూస్ లీ ‘ఎంటర్ ది డ్రాగన్’ సినిమా నుంచేనని వర్మ సంచలన విషయం బయటపెట్టారు. మొదట నాగార్జునతో ‘రాత్రి’ లాంటి హారర్ సినిమా చేద్దామని అనుకుంటున్న సమయంలో, ఆయన ‘ఎంటర్ ది డ్రాగన్’ 15వ సారి చూశారట.
ఆ సినిమాలో ఓ రెస్టారెంట్ ఫైట్ ఉంటుందని, అందులో హీరో ఓ అమ్మాయిని ఏడిపించిన విలన్‌ను కొడతాడని, వాడు మళ్లీ గ్యాంగ్‌ను తెస్తాడని వర్మ చెప్పారు. ఆ సీన్‌నే స్ఫూర్తిగా తీసుకుని, రెస్టారెంట్‌కు బదులు కాలేజ్ బ్యాక్‌డ్రాప్ పెట్టి ‘శివ’ కథ రాసుకున్నారట.
ఇక తెలుగు సినిమా చరిత్రలోనే ఐకానిక్‌గా నిలిచిపోయిన ‘సైకిల్ చైన్’ ఐడియా ఎలా వచ్చిందో కూడా RGV వివరించారు. విలన్లు హీరోను కొట్టడానికి కత్తులు, రాడ్లతో పక్కా ప్లాన్‌తో వస్తారు. కానీ హీరో (శివ) ఒక సాధారణ స్టూడెంట్, అతని దగ్గర ఆయుధాలు ఉండవు.
ఆ ఫైట్‌లో, అప్పటికప్పుడు చేతికి దొరికిన వస్తువునే ఆయుధంగా మార్చుకోవాలి. ఆ సమయంలో అక్కడ కనిపించిందే సైకిల్. అందుకే దాని చైన్ తెంపి, దాన్నే ఆయుధంగా వాడే సీన్ పెట్టానని, అది ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ అయిందని వర్మ తెలిపారు.
అలాగే, నానాజీతో వచ్చే “త్రీ-పంచ్ సీన్” కూడా అప్పట్లో ఓ కొత్త ట్రెండ్ సెట్ చేసిందన్నారు. మరో మూడు రోజుల్లో ఈ అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లను బిగ్ స్క్రీన్‌పై చూసి ఎంజాయ్ చేసేందుకు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
