
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటివరకు పలువురు ప్రజాప్రతినిధుల ఫోన్లు ట్యాప్ అయినట్లు బయటపడగా, తాజాగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేరు కూడా ఈ జాబితాలో చేరిందని సమాచారం.
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే షర్మిల మొబైల్ కాల్స్‌ను రహస్యంగా ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ ట్యాపింగ్‌లో కోడ్ భాషను ఉపయోగించారని విశ్వసనీయ సమాచారం. షర్మిల వాయిస్ రికార్డులు, ఆమెతో మాట్లాడిన వారిపై సమాచారం సీఎం జగన్‌కి చేరేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
షర్మిల ఎవరితో సంప్రదింపులు జరుపుతున్నారో తెలుసుకునేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీనికితోడు, ఆమె సన్నిహితులను ఒక సీనియర్ పోలీస్ అధికారి పిలిపించి హెచ్చరించాడన్నది బయటకు వచ్చిన విషయం.
ఈ వ్యవహారాన్ని షర్మిల అప్పుడే గుర్తించిందనీ, తాను ఫోన్ ట్యాప్ అవుతున్నానని అనుమానంతో కొన్ని జాగ్రత్తలు తీసుకుందని చెబుతున్నారు. ఆమె దగ్గర కీలక ఆధారాలున్నాయని సమాచారం.
ఈ కేసులో మరిన్ని ట్విస్టులు వెలుగులోకి రానున్నాయని, షర్మిల అధికారికంగా స్పందిస్తే పెద్ద కలకలం రేగే అవకాశముంది.