
భారత క్రికెట్‌లో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, సీనియర్ పేసర్ మహ్మద్ షమీ మధ్య ఫిట్‌నెస్‌పై మాటల యుద్ధం రాజుకుంది. తాను ఫిట్‌గా లేనంటూ అగార్కర్ చేసిన వ్యాఖ్యలను షమీ మైదానంలో ప్రదర్శనతో పాటు, సోషల్ మీడియా వేదికగానూ బలంగా తిప్పికొట్టాడు. ఈ పరిణామం ఇప్పుడు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున బరిలోకి దిగిన షమీ, ఉత్తరాఖండ్‌పై అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. తన ఫిట్‌నెస్‌పై వస్తున్న సందేహాలకు బంతితోనే సమాధానమిచ్చాడు. ఆ తర్వాత సోషల్ మీడియాలో, “నేను ఎలా బౌలింగ్ చేస్తున్నానో మీ కళ్ల ముందే ఉంది. అయినా సరే అతడు అలాంటి వ్యాఖ్యలు చేశాడు. సరే, చెప్పాలనుకున్నది చెప్పనివ్వండి” అంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అగార్కర్ మాట్లాడుతూ… ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌కు షమీని ఎంపిక చేయాలని భావించినా, అతని ఫిట్‌నెస్ పూర్తిస్థాయిలో సహకరించలేదని తెలిపారు. “షమీ వంటి అనుభవజ్ఞుడైన బౌలర్ ఫిట్‌గా ఉంటే మేం జట్టులోకి ఎందుకు తీసుకోం?” అని ఆయన ప్రశ్నించారు.
దేశవాళీలో మరిన్ని మ్యాచ్‌లు ఆడితే షమీ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని, అప్పుడు జట్టులోకి పునరాగమనం చేసే అవకాశాలు కచ్చితంగా ఉంటాయని అగార్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అతని అనుభవం జట్టుకు ఎంతో అవసరమని ఆయన పరోక్షంగా అంగీకరించారు.
అయితే, అగార్కర్ వ్యాఖ్యలు ఒకలా ఉంటే, షమీ తన ప్రదర్శనతో మరోలా సమాధానమిస్తున్నాడు. ఈ ఘటనతో ఆటగాడి ఫిట్‌నెస్‌ను అంచనా వేయడంలో సెలక్టర్లకు, ఆటగాడికి మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి.
