
సినీ ఇండస్ట్రీలో ‘రిటైర్మెంట్’ అనే పదానికి పెద్దగా స్థానం లేదు. ఆఫర్లు తగ్గినప్పుడు నటీనటులు నెమ్మదిగా పక్కకు తప్పుకోవడం సహజమే కానీ, ఇలా అఫీషియల్‌గా డేట్ అనౌన్స్ చేసి మరీ సినిమాలకు దూరమవ్వడం చాలా అరుదు. అయితే, ప్రముఖ సీనియర్ నటి తులసి మాత్రం అందరికీ షాక్ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాల తన సినీ ప్రయాణానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు ప్రకటించారు.
కేవలం నాలుగు సంవత్సరాల వయసులోనే బాలనటిగా కెమెరా ముందుకు వచ్చిన తులసి, దాదాపు ఐదు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, భోజ్‌పురి భాషల్లో కలిపి ఏకంగా 300కి పైగా సినిమాల్లో నటించారు. ఒకప్పుడు హీరోయిన్‌గా మెప్పించిన ఆమె, కన్నడ డైరెక్టర్ శివమణిని పెళ్లాడాక కుటుంబ బాధ్యతల కోసం కొంతకాలం బ్రేక్ తీసుకున్నారు.
ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేశారు. ‘శంఖారావం’ నుంచి మొదలుకొని మొన్నటి ‘ఎఫ్ 3’ వరకు ఎన్నో సినిమాల్లో అమ్మగా, అత్తగా ఆడియెన్స్‌ను అలరించారు. ప్రభాస్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాల్లోనూ ఆమె కీలక పాత్రలు పోషించారు. చేతిలో సినిమాలు ఉన్నప్పటికీ, ఆమె ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం విశేషం.
ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీతో నటనకు స్వస్తి పలుకుతున్నట్లు తులసి డిసైడ్ అయ్యారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో “హ్యాపీ రిటైర్మెంట్” అనే గ్రీటింగ్ కార్డును పోస్ట్ చేసి ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. తను ఎంతో భక్తితో ఆరాధించే షిర్డీ సాయిబాబా సేవలో మిగిలిన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు.
ఈ డిసెంబర్ 31న షిర్డీ వెళ్తున్నానని, ఆ రోజు నుంచి ఇక సినిమాలకు దూరంగా ఉంటూ, పూర్తి సమయం బాబా సేవకే అంకితం చేస్తానని తులసి ఎమోషనల్ అయ్యారు. సినిమా రంగుల ప్రపంచాన్ని వదిలి, ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్న ఆమెకు సోషల్ మీడియాలో అభిమానులు, సినీ ప్రముఖులు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
