
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల, వరుసగా శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ (ఎల్ఎల్పీ) బేనర్లో సినిమాలు చేస్తున్నాడు. ఏషియన్ మూవీస్ అధినేత సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు కలిసి నడిపిస్తున్న ఈ సంస్థలో కమ్ముల ఇప్పటికే రెండు సినిమాలు చేశారు.
లవ్ స్టోరి మోస్తరు విజయం సాధించగా, తాజాగా విడుదలైన కుబేర మంచి ఫలితాన్ని అందుకుంది. ఈ విజయాల తర్వాత మళ్లీ అదే బేనర్లో కమ్ముల మరో సినిమా చేయబోతున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
వినాయక చవితి సందర్భంగా ఈ విషయాన్ని బయటపెట్టారు. అయితే, సినిమా కథ, నటీనటుల గురించి ఎలాంటి వివరాలు ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రారంభ దశలో ఉందని, త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామని వారు తెలిపారు.
కమ్ముల సాధారణంగా తన సినిమాల స్క్రిప్ట్‌కి, ప్రీ-ప్రొడక్షన్ పనులకి ఎక్కువ సమయం కేటాయిస్తాడు. కాబట్టి ఈ కొత్త సినిమా వచ్చే ఏడాది ప్రారంభమయ్యే అవకాశముందని ఫిలింనగర్ టాక్.
కుబేర ప్రమోషన్ల సమయంలో కమ్ముల, తన తదుపరి సినిమాను మళ్లీ ప్రేమకథా నేపథ్యంతో తీయాలని ఆలోచిస్తున్నట్లు తెలిపాడు. అతడి మార్క్ స్టైల్లోని లవ్ స్టోరీ, క్లాస్-మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు.
