
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమే నిజమైంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు రెండో పెళ్లి చేసుకున్నారు. ఇవాళ (డిసెంబర్ 1) ఉదయం తన సన్నిహితుల సమక్షంలో, ఆధ్యాత్మిక వాతావరణం నడుమ ఆమె వివాహం జరిగింది. ఇప్పటి వరకు కేవలం రూమర్స్ మాత్రమే అనుకున్న వారికి, సమంత స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు షేర్ చేసి షాక్ ఇచ్చారు. కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సమంతకు ఫ్యాన్స్, సెలబ్రిటీలు విషెస్ చెబుతున్నారు.
ఆధ్యాత్మిక వాతావరణంలో..
సమంత షేర్ చేసిన ఫోటోలను బట్టి చూస్తుంటే, ఈ పెళ్లి చాలా ప్రశాంతంగా, సంప్రదాయబద్ధంగా జరిగినట్లు అర్థమవుతోంది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ఈశా యోగా సెంటర్‌లోని లింగ భైరవి ఆలయం ఈ వేడుకకు వేదికైంది. ఎర్రటి పట్టు చీరలో, మెడలో సంప్రదాయ ఆభరణాలతో సమంత మెరిసిపోతుండగా, వరుడు రాజ్ నిడమూరు క్రీమ్ కలర్ కుర్తా, గోల్డ్ కలర్ జాకెట్‌లో కనిపించారు. ఇద్దరూ చేతిలో చేయి వేసుకుని నవ్వుతూ నడుచుకుంటూ వస్తున్న ఫోటో చూస్తుంటే వారి ఆనందం స్పష్టంగా తెలుస్తోంది.
ఉంగరాలు మార్చుకుని.. అగ్ని సాక్షిగా!
మరొక ఫోటోలో ఇద్దరూ ఉంగరాలు మార్చుకుంటున్న దృశ్యం ఉంది. అలాగే హోమం ముందు కూర్చుని పూజలు చేస్తున్న ఫోటోలు కూడా సమంత షేర్ చేశారు. ఈ ఫోటోలకు ఆమె ఎలాంటి పెద్ద క్యాప్షన్ పెట్టలేదు. కేవలం “01.12.2025” అనే తేదీని, వైట్ హార్ట్ ఎమోజీని జత చేశారు. ఆ ఒక్క డేట్, ఆ ఫోటోలు చాలు.. ఆమె జీవితంలో వచ్చిన కొత్త మార్పును చెప్పడానికి.
వరుడు రాజ్ నిడమూరు..
సమంత పెళ్లాడింది ప్రముఖ బాలీవుడ్, ఓటీటీ డైరెక్టర్ రాజ్ నిడమూరునే అని ఫోటోలతో క్లారిటీ వచ్చేసింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ద్వారా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి, ఇప్పుడు పెళ్లి పీటల వరకు వచ్చింది. నాగచైతన్యతో విడాకుల తర్వాత ఒంటరిగా ఉన్న సమంతకు, రాజ్ నిడమూరు తోడుగా నిలిచారు. రాజ్ కూడా గతంలో విడాకులు తీసుకున్నవారే. ఇప్పుడు వీరిద్దరూ కలిసి కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు.
