
న్యూస్ డెస్క్: భారతీయ రూపాయి విలువ చరిత్రలో మరో కనిష్ఠాన్ని తాకి, దేశ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర ఆందోళనలను పెంచింది. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి డాలర్‌తో రూపాయి విలువ ₹89.66 వద్ద నిలిచింది. ఒక్క రోజులోనే ₹1.03 పతనం నమోదు కావడం, రూపాయి 90 స్థాయిని దాటే ప్రమాదం అంచున నిలబడడం ఆర్థిక భవిష్యత్తుపై ప్రశ్నార్థకం వేస్తోంది.
రూపాయి పతనానికి అమెరికా–భారత్ వాణిజ్య చర్చల్లో స్పష్టత లేకపోవడమే ప్రధాన కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికా విధించిన భారీ టారిఫ్‌లు భారత ఎగుమతులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి.
దీంతో వాణిజ్య అనిశ్చితి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మార్కెట్ల నుంచి పెద్ద ఎత్తున తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఇప్పటివరకు $16.5 బిలియన్ కంటే ఎక్కువ మొత్తం దేశం నుంచి బయటకు వెళ్లినట్లు సమాచారం.
ప్రపంచ మార్కెట్లలో డాలర్ బలోపేతం కావడం కూడా రూపాయి పతనానికి దోహదపడింది. మరోవైపు, గతంలో రూపాయికి మద్దతుగా రంగంలోకి దిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈసారి మౌనం పాటించడం ప్రతికూల సంకేతాలు పంపింది.
బలహీన రూపాయి సామాన్య భారతీయుడిపై నేరుగా ప్రభావం చూపుతుంది. దిగుమతులపై ఆధారపడిన భారత్‌లో చమురు, పెట్రోల్ ధరలు, ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు పెరుగుతాయి. తద్వారా ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యుడిపై భారం పెరుగుతుంది.
అమెరికా ఇండియా ట్రేడ్ టాక్స్‌లో తక్షణ పురోగతి లేకపోతే రూపాయి త్వరలోనే 90 స్థాయిని దాటే ప్రమాదం ఉందని విశ్లేషకుల అంచనా. వాణిజ్య సమస్య త్వరగా పరిష్కారం కాకపోతే భారత ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం పడుతుంది.
