
న్యూస్ డెస్క్: టీమిండియాలో సీనియర్, జూనియర్ అనే తేడా లేదని, జాతీయ జట్టుకు ఆడాలంటే దేశవాళీ క్రికెట్ తప్పనిసరి అని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు ఇప్పుడు దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు కొత్త సవాల్ విసురుతున్నాయి.
ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్‌కే పరిమితమైన వీరికి, మ్యాచ్‌ల మధ్య భారీ విరామం వస్తోంది. ఈ నేపథ్యంలో, మ్యాచ్ ఫిట్‌నెస్ నిరూపించుకోవాలంటే దేశవాళీ వన్డే టోర్నీ ‘విజయ్ హజారే’ ఆడక తప్పని పరిస్థితి. డిసెంబర్ 24 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది.
బీసీసీఐ సూచన మేరకు రోహిత్ శర్మ.. విజయ్ హజారేతో పాటు, నవంబర్ 26 నుంచి మొదలయ్యే ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో కూడా ఆడతానని ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు తెలిపాడు. దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ (నవంబర్ 30) లోపు ఒకటి రెండు టీ20 మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది.
కోహ్లీ మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అతను చివరిసారిగా 2010లో ఈ టోర్నీ ఆడాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా టూర్లో విఫలమవడంతో రంజీ మ్యాచ్ ఆడినా, అందులో రాణించలేకపోయాడు.
భారత తొలితరం దిగ్గజం విజయ్ హజారే పేరు మీద 2002-03లో ఈ టోర్నీ ప్రారంభమైంది. వయసు, ఫామ్ దృష్ట్యా ఈ టోర్నీ రో-కోలకు కఠిన పరీక్షే. ఇక్కడ రాణిస్తేనే 2027 ప్రపంచకప్ రేసులో నిలవగలుగుతారు.
