
న్యూస్ డెస్క్: సామాన్య మధ్యతరగతి ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టే అంశం ఏదైనా ఉందంటే అది ఈఎంఐలు. గృహ రుణాల భారం తగ్గాలని ఎదురుచూసే వారికి కొత్త ఏడాది కంటే ముందే గుడ్ న్యూస్ రానుంది. డిసెంబరులో జరిగే ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) సమావేశంలో రెపోరేటును తగ్గించే వీలుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ అంచనాలకు బలం చేకూరేలా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తాజాగా కీలక సంకేతాలు ఇచ్చారు. రెపో రేటును మరింత తగ్గించేందుకు అవకాశాలు ఉన్నట్లు ఆయన పరోక్షంగా పేర్కొన్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో కీలక రెపో రేటును 100 బేసిక్ పాయింట్లు తగ్గించిన ఆర్బీఐ, ఆగస్టు నుంచి దానిని 5.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగిస్తోంది.
డిసెంబరులో జరిగే సమావేశంలో రెపో రేటు మరో 25 బేసిక్ పాయింట్లు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అదే జరిగితే రెపో రేటు 5.25 శాతానికి చేరుకుంటుంది.
రెపో రేటు తగ్గితే, బ్యాంకులు కస్టమర్లకు అందించే గృహ రుణాలు వాహన రుణాలపై వడ్డీ రేట్లు కూడా తగ్గుతాయి. దీనివల్ల ఈఎంఐ చెల్లించే వారికి కొంత మేర ఆర్థిక ఊరట లభిస్తుంది.
మధ్యతరగతి జీవికి ఇంతకంటే స్వీట్ న్యూస్ ఇంకేం ఉంటుంది? ఈ నిర్ణయంపై డిసెంబరులో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
