
హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేయడం మాస్ మహారాజా రవితేజ స్టైల్. ‘మాస్ జాతర’తో మరో ఫ్లాప్‌ను మూటగట్టుకున్న ఆయన, ఆ నిరాశను ఏమాత్రం దరిచేరనీయకుండా తన తదుపరి చిత్రాలపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆయన కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (RT 76) సినిమా చేస్తున్నారు.
ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే, రవితేజ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను కూడా లైన్‌లో పెట్టినట్లు గట్టిగా టాక్ వినిపిస్తోంది. ఈసారి ఆయన ‘బింబిసార’ ఫేమ్, టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్టతో చేతులు కలపనున్నారని సమాచారం.
వశిష్ట చెప్పిన కథ రవితేజకు బాగా నచ్చిందని, తన స్టైల్‌కు సరిగ్గా సరిపోతుందని భావించి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలుస్తోంది. స్క్రిప్ట్, రవితేజ డేట్లు కూడా లాక్ అయ్యాయని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ‘RT 76’ తర్వాత రవితేజ చేయబోయే ప్రాజెక్ట్ ఇదేనంటున్నారు.
ప్రస్తుతం వశిష్ట.. మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. ఆ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కానుంది. ఈ గ్యాప్‌లో వశిష్ట తన తదుపరి సినిమాను సెట్ చేసుకునే పనిలో పడ్డారు.
రవితేజ, వశిష్ట కాంబోలో ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ రానుందని ప్రచారం జరుగుతోంది. వరుస ఫ్లాపుల్లో ఉన్న రవితేజ, ‘బింబిసార’ వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన దర్శకుడితో సినిమా చేస్తుండటంతో, ఈసారైనా గట్టి హిట్ పడుతుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
