
స్టార్ హీరోలు తమ 75వ, 100వ వంటి ల్యాండ్‌మార్క్ చిత్రాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా, భారీ ప్రణాళికలతో చేస్తారు. అగ్ర దర్శకులు, అగ్ర నిర్మాణ సంస్థలతో కలిసి ఆ అంచనాలను అందుకునే ప్రయత్నం చేస్తారు. కానీ, మాస్ మహారాజా రవితేజ మాత్రం ఈ విషయంలో పూర్తి భిన్నంగా కనిపిస్తున్నారు.
ఆయన తాజా చిత్రం ‘మాస్ జాతర‘ రవితేజ కెరీర్‌లో 75వ సినిమా కావడం విశేషం. అయితే, ఈ విషయం రవితేజకు కూడా తెలియదట. దర్శకుడు భాను భోగవరపు వికీపీడియాలో లెక్క చూసి చెప్పే వరకు, ఆయన తన 75వ సినిమా చేస్తున్నాననే విషయాన్ని కూడా పట్టించుకోలేదట.
“నంబర్ గురించి ఆలోచించొద్దు, ప్రశాంతంగా సినిమా తీయి” అని రవితేజ దర్శకుడికి చెప్పడం ఆయన శైలికి నిదర్శనం. అందుకే తన ల్యాండ్‌మార్క్ సినిమా కోసం స్టార్ డైరెక్టర్‌ను కాకుండా, రైటర్‌గా, అసోసియేట్‌గా అనుభవం ఉన్న భాను భోగవరపుకు తొలి అవకాశం ఇచ్చారు.
రవితేజ కొత్తవారికి అవకాశాలు ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటారు. ముఖ్యంగా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో కష్టపడి, కథపై పట్టున్న వారిని ఆయన ఎక్కువగా ప్రోత్సహిస్తారు.
దీనికి కారణం, హీరో కాకముందు రవితేజ కూడా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేయడమే. కష్టం విలువ తెలిసిన నటుడు కాబట్టే, ఆయన నిజాయితీగా పనిచేసే టెక్నీషియన్లను నమ్మి అవకాశాలు ఇస్తారు.
‘మాస్ జాతర’ మాస్ కథే అయినా, రవితేజ మార్క్ కామెడీ పుష్కలంగా ఉంటుందని తెలుస్తోంది. ల్యాండ్‌మార్క్ సినిమా అనే హడావుడి లేకుండా, కేవలం కథను నమ్మి కొత్తవారితో రవితేజ చేస్తున్న ఈ ప్రయోగం ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.
