
నితేష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న ‘రామాయణం‘ సినిమా రేంజ్ మామూలుగా లేదు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ తో అంచనాలు పెంచేసిన మేకర్స్, ఇప్పుడు మరో క్రేజీ ప్లాన్ తో ముందుకొచ్చారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 45 నుంచి 50 భాషల్లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇది నెవ్వర్ బిఫోర్ అని చెప్పాలి.
రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. మొదటి పార్ట్ 2026 దీపావళికి థియేటర్లలోకి దిగుతుంది. రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై పాన్ వరల్డ్ స్థాయిలో హైప్ క్రియేట్ అయ్యింది.
తాజాగా ఈ సినిమా గ్లింప్స్ ను అరబిక్ భాషలో రిలీజ్ చేసి మేకర్స్ అందరికీ షాక్ ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తుంటే అరబ్ దేశాల్లో కూడా ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్లు అర్థమవుతోంది. అక్కడ మన ఇతిహాసానికి ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూడాలి.
ఇప్పటివరకు మన సినిమాలు ఐదారు భాషల్లో వస్తేనే గొప్ప అనుకునేవాళ్లం. అలాంటిది 45 భాషల్లో డబ్బింగ్ అంటే సామాన్య విషయం కాదు. గ్లోబల్ ఆడియన్స్ కు అర్థమయ్యేలా స్థానిక నేటివిటీకి తగ్గట్టు కొన్ని మార్పులు కూడా చేస్తున్నారట. నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ ప్రాజెక్టును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అరబిక్ వెర్షన్ తో మొదలైన ఈ గ్లోబల్ ప్రమోషనల్ క్యాంపెయిన్ రిలీజ్ నాటికి ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.
