
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, రాజమౌళి-మహేష్ బాబు (SSMB29) చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారని అందరూ భావిస్తున్నారు. ‘మందాకిని’గా చీరకట్టులో గన్ పట్టుకున్న ఆమె ఫస్ట్ లుక్ సంచలనం సృష్టించింది. అయితే, ప్రియాంకకు ఇది తొలి తెలుగు సినిమా కాదని, 23 ఏళ్ల క్రితమే ఆమె టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాల్సిందని చాలా మందికి తెలియదు.
2002లో, మిస్ వరల్డ్ గెలిచిన వెంటనే, ప్రియాంక ‘తమిళన్’ (తమిళ్) చిత్రంతో పాటు తెలుగులో ‘అపురూపం’ అనే సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. మధుకర్, ప్రసన్న హీరోలుగా, జి.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో ఈ సినిమా సగం షూటింగ్ కూడా జరుపుకుంది.
కానీ, ఆర్థిక కారణాల వల్ల ఆ ‘అపురూపం’ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో ప్రియాంక టాలీవుడ్ ఎంట్రీకి బ్రేక్ పడింది. ఆమె బాలీవుడ్‌కు వెళ్లి, అక్కడ అగ్ర తారగా ఎదిగి, ఆపై హాలీవుడ్‌లో గ్లోబల్ ఐకాన్‌గా, యాక్షన్ క్వీన్‌గా స్థిరపడింది.
ఇప్పుడు, 23 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, ప్రియాంక చోప్రా మళ్లీ తెలుగు తెరపైకి వస్తోంది. ఆనాడు ఓ చిన్న సినిమాతో రాలేకపోయినా, ఇప్పుడు ఏకంగా రాజమౌళి దర్శకత్వంలో, మహేష్ బాబు సరసన పాన్-వరల్డ్ చిత్రంతో అడుగుపెడుతోంది.
ఒకవేళ ‘అపురూపం’ విడుదలై ఉంటే ఆమె కెరీర్ మరోలా ఉండేదేమో. కానీ ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా, ‘మందాకిని’ వంటి పవర్‌ఫుల్ యాక్షన్ పాత్రతో టాలీవుడ్‌కు పరిచయం కాబోతుండటం విశేషం.
